Team India next Target to Win Asia Cup 2025 | భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైట్ బాల్ మ్యాచ్‌లలో అతని రికార్డు బాగుంది. టెస్ట్ సిరీస్‌లో అయితే మిశ్రమ ఫలితాలు వస్తున్నాయన్న కారణంగా కొన్ని రోజుల కిందట ట్రోలింగ్‌ బాధితుడిగా మారాడు. టీమిండియా ముందున్న కొత్త టార్గెట్ ఆసియా కప్ 2025. ఈ ఆసియా దేశాలు పాల్గొనే టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటాలని భారత జట్టు భావిస్తోంది. ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుండటం మనకు కలిసి రానుంది. హెడ్ కోచ్ గంభీర్‌కు కేవలం 15 నెలల్లో టీమ్ ఇండియాకు రెండో ట్రోఫీని గెలిపించే అవకాశం వచ్చింది. ఇంతకు ముందు, గంభీర్ హెడ్ కోచ్‌గా భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతకు ముందు ద్రావిడ్ కోచ్‌గా  2024 టీ20 ప్రపంచ కప్‌ భారత్ నెగ్గింది. టీ20లలో కోచ్ గంభీర్ కోచింగ్ రికార్డు ఎలా ఉందో చూడండి.

టీ20లో గౌతమ్ గంభీర్ రిపోర్ట్ కార్డ్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టు మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో 11 సార్లు విజయం సాధించింది. కోచ్‌గా గంభీర్ టీ20లలో 85 శాతం విజయాలతో బెస్ట్ అనిపించుకున్నాడు. తమ్ గంభీర్ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. మొదటిసారిగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో భారత కోచ్ పదవిని చేపట్టాడు, అంతకుముందు జింబాబ్వే పర్యటనలో లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా ఉన్నాడు. గంభీర్ కోచ్‌గా 13 మ్యాచ్‌లలో టీమిండియా కేవలం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో మాత్రమే ఓటమిపాలైంది.

గంభీర్ కోచ్‌ అయ్యాక సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి టీ20లలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. తాజాగా గంభీర్ కోచ్‌గా భారత్ తొలిసారిగా ఆసియా కప్‌లో బరిలోకి దిగడానికి సన్నద్ధమవుతోంది. 

ఆసియా కప్‌లో గౌతమ్ గంభీర్ రికార్డు

వన్డే ఫార్మాట్‌లో ఆడిన ఆసియా కప్ టోర్నమెంట్‌లలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 13 మ్యాచ్‌లలో 44.07 సగటుతో 573 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో గంభీర్ ఎప్పుడూ ఆడలేదు. గంభీర్ చివరగా 2012లో ఆసియా కప్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 

ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టు..

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ,  శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్) శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్ 

ఏడాది తరువాత శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. కానీ రెగ్యూలర్ గా టీ20లు ఆడుతూ అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌ను సెలక్ట్ చేయకపోవడంపై ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం, ఆసియాప్ కప్ లోనూ మొండిచేయి చూపించడంతో పలువురు మాజీ క్రికెటర్లు అయ్యర్‌కు మద్దతు తెలిపారు.