Ind VS Eng 1st Test Updates: ఈనెల 20 నుంచి ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. హెడీంగ్లీలో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ వేటను భారత్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో గురువారం టీమిండియా టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ తో కలిసి హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. ఈ టూర్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా పాత్ర కీలకమైనదని, అతడిని కీలక మ్యాచ్ ల్లో మాత్రమే ఆడిస్తామని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ ఫలితాలను బట్టి, ఏయే మ్యాచ్ లో ఆడతాడు అనేది ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఇక మైదానం, వాతవారణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. గాయాలతో సతమతమవుతున్న బుమ్రాపై పనిభారాన్ని తగ్గించేందుకు గాను తనను రొటేషన్ పాలసీలో భాగంగా ఆడించనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యమ్నాయాలు ఉన్నాయి.. బుమ్రా లోటును పూరించలేమని, అయితే అతడిని భర్తీ చేయగల ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని విశ్వాసం వ్యక్తం గంభీర్ చేశాడు. దేశవాళీల్లో సత్తా చాటే ఆటగాళ్లకు టీమిండియాలో తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని, కరుణ్ నాయరే అందుకు ఉదాహరణ అని తెలిపాడు. అతని అనుభవం చాలా ఉపకరిస్తుందని పేర్కొన్నాడు. ఇక టెస్టుల్లో గెలవాలంటే వెయ్యి పరుగులు చేసిన సాధ్యం కాదని, 20 వికెట్లు తీస్తే మాత్రం ఈ ఘనత సాధించవచ్చని, అందుకే నాణ్యమైన బౌలర్లను ఎంపిక చేశామని పేర్కొన్నాడు.
గంభీర్ విచారం..ఇక ఐపీఎల్ విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై గంభీర్ విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి విజయోత్సవాలను తను ఎంకరేజ్ చేయనని, మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపాడు. ఈ విజయోత్సవాలు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతాయని, అందుకే వీటికి తాను వ్యతిరేకమని తెలిపాడు. ఇక తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ఇక, 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి విజయోత్సవాలు చేయకూడదని భావించినట్లు గంభీర్ తెలిపాడు. ఇక స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో తన మార్కును చూపించే అవకాశం గంభీర్ కు దక్కింది. ఇప్పటికే టీ20 జట్టును దుర్భేద్యంగా చేసిన గంభీర్.. టెస్టుల్లోనూ అలాంటే ప్రదర్శనే చేయాలని భావిస్తున్నాడు. టీమిండియా త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు బయలు దేరివెళ్లనుంది. 45రోజులకు పైగా జరిగే ఈ పర్యటనలో 18 మందిని టీమిండియాలోకి ఎంపిక చేశారు. మరోవైపు తొలిటెస్టు కోసం 14 మందితో కూడిన స్క్వాడ్ ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది.