Kuldeep Yadav News: భారత చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుధవారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో అత‌ని ఎంగేజ్మెంట్ చిన్న‌నాటి స్నేహితురాలైన వంశిక‌తో జ‌రిగింది. కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల మ‌ధ్య ఈ వేడుక జ‌రిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ అయ్యాయి. నెటిజ‌న్లు కుల్దీప్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ, బెస్టాఫ్ ల‌క్ చెబుతున్నారు. ఇక వేడుక‌లో పెద్ద‌ల సమ‌క్షంలో కుల్దీప్, వంశిక ఉంగ‌రాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక జ‌రిగే వ‌ర‌కు కుల్దీప్ దీనిపై ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు పొక్కకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఇటీవ‌లే ముగిసిన ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున కుల్దీప్ ప్రాతినిథ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు అర్హ‌త సాధించ‌క‌పోవ‌డంతో ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత రోజే కుల్దీప్ ఎంగేజ్మెంట్ వేడుక చేసుకోవ‌డం విశేషం. 

రింకూ సింగ్ హాజ‌రు..ఇక అతి త‌క్కువ స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగిన ఈ వేడ‌క‌కు యూపీకే చెందిన విధ్వంస‌క బ్యాట‌ర్ రింకూ సింగ్ హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. ఇక కుల్దీప్ కాబోయే స‌తీమ‌ణి వంశిక‌.. ఎల్ ఐసీలో ప‌ని చేస్తోంది. కుల్దీప్ తో ఆమ‌కు చిన్న‌ప‌టి నుంచి స్నేహం ఉంది. ఇది రానురాను ప్రేమ‌గా మారి, త్వర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదికి సంబంధించి వివ‌రాలు తెలియ‌క‌పోయినా, త్వరలోనే వీరిద్ద‌రి వివాహం జ‌రుగ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ త‌ర్వాత జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క ఇంగ్లాడ్ ప‌ర్య‌ట‌న‌కు కుల్దీప్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కొత్త కెప్టెన్ శుభ‌మాన్ గిల్ నాయ‌క‌త్వంలో టీమిండియా.. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల‌ను ఆడ‌నుంది. ఈ సిరీస్ తోనే 2025-27 ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ రేసుకు భార‌త్ శ్రీకారం చుడుతోంది. స్టార్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించడంతో యువ ఆట‌గాళ్ల‌కు బ‌రిలో దిగేందుకు అవ‌కాశం చిక్క‌నుంది. దీనిని ఎంత‌వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.. 

అడ‌పా ద‌డ‌పా.. ఇక కుల్దీప్ విష‌యానికొస్తే మూడు ఫార్మాట్ల‌లోనూ భార‌త్ త‌ర‌పున ఆడిన అనుభ‌వం ఉంది. 2014లో భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేసిన కుల్దీప్ కు 11 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభ‌వం ఉంది. త‌నకు మెయిన్ గా వైట్ బాల్ క్రికెట్లోనే చోటు ద‌క్కుతోంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 13 టెస్టులు, 113 వ‌న్డేలాడిన కుల్దీప్.. 40 టీ20ల్లోనూ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఓవ‌రాల్ గా 300కి పైగా అంత‌ర్జాతీయ వికెట్లు తీసిన అనుభ‌వం అత‌ని సొంతం. మూడు ఫార్మాట్ల‌లోనూ త‌న బెస్ట ఫార్మ‌ర్మెన్స్ గా ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌టం విశేషం.