Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీస్ కేసు నమోదైంది. అతడిపై అతని భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంబ్లీ సతీమణి ఆండ్రియా ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు అతడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఇంతకీ ఏం జరగిందంటే..
ముంబయి బాంద్రాలోని నివాసంలో తన భర్త వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనపై దాడి చేశాడని అతని భార్య ఆండ్రియా పోలీసులకు తెలిపింది. తనను దుర్భాషలాడటంతోపాటు తనపై కుకింగ్ పాన్ ను విసిరికొట్టాడని పేర్కొంది. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాంబ్లీ మద్యం తాగి వచ్చి తన భార్యను విపరీతంగా దుర్భాషలాడుతూ దాడి చేసినట్లు చెప్పారు. దీంతో ఆమె తలకు గాయం అయ్యిందని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆండ్రియా ఫిర్యాదుతో పోలీసులు కాంబ్లీపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 324, ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు. ఇప్పటివరకు వినోద్ కాంబ్లీని అరెస్ట్ చేయలేదని స్పష్టంచేశారు.
టీమిండియా మాజీ క్రికెటరైన వినోద్ కాంబ్లీకి వివాదాలు కొత్తకాదు. ఇప్పటివరకు ఆయన చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్ తరఫున తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే వివాదాల్లో చిక్కుకుని తన కెరీర్ ను నాశనం చేసుకున్నారు.