Indian Fans Asked Sachin Tendulkar To Support Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  కాంబ్లీ  అసలు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఏదో  పని మీద బయటికొచ్చిన ఆయన ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నారు. అయినా కూడా ఒక్క అడుగు కూడా  నడవలేక కిందపడిపోతున్నట్టు  చాలా ఇబ్బంది పడ్డారు. అది గమనించిన  స్థానికులు అతన్ని పట్టుకొని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు.  ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. 


నిజానికి వీడియోలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి మొదట అందరూ అతను బాగా తాగి ఉన్నాడు, అందుకే సరిగ్గా నడవలేకపోతున్నాడు అని అన్నారు. అయితే మరి కొందరు మాత్రం గత కొన్నేళ్లుగా వినోద్ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే అతను ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చని చెబుతున్నారు. బీసీసీఐ(bcci) ఇచ్చే పింఛనుతోనే  అతను తన కుటుంబాన్ని జాగ్రత్తగా నెట్టుకొస్తున్నారు అని చెబుతున్నారు. 






తాజాగా వైరల్ అయిన ఈ వీడియొ లో కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరీ  క్షీణించినట్టుగా కనపడటం, అస్సలు నడవలేని స్థితిలో ఉండడంతో  అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో  క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తన బాల్య  మిత్రుడు కాంబ్లీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని  సోషల్ మీడియాలో సచిన్ ను  టాగ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. 






 664 పరుగుల భాగస్వామ్యం


భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, మాజీ స్టార్ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఇద్దరూ మంచి స్నేహితులు. పాఠశాల స్థాయి క్రికెట్‌లో 1988లో ఇద్దరు కలిసి ఆడారు. అంతే కాదు హారిస్‌ షీల్డ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ జోడి ఏకంగా  664 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది.  ఇందులో కాంబ్లి 349 పరుగులు చేయగా , సచిన్ 326 పరుగులు చేశాడు. 1991లో షార్జాలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డేలో అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 121 మ్యాచ్ లలో  3,561 పరుగులు చేశాడు. భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు.   అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన కొద్దికాలంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో అనేక రికార్డులను నెలకొల్పాడు. అయితే ఫామ్‌ కోల్పోయి కెరీర్‌ను త్వరగానే  ముగించారు.