Ind Vs Eng 1st Test Day 5 Result Update: ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. మ‌రోసారి ఇండియాపై 370+ ప‌రుగుల టార్గెట్ ను స‌క్సెస్ఫుల్ గా ఛేజ్ చేసింది. మంగ‌ళ‌వారం ఐదో రోజు మ‌రో 350 ప‌రుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ 82 ఓవ‌ర్లలో 5 వికెట్ల‌కు 373 ప‌రుగులు చేసి, ఐదు వికెట్లతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ అద్భుత సెంచ‌రీ (170 బంతుల్లో 149,21 ఫోర్లు, 1 సిక్సర్) తో కీల‌క పాత్ర పోషించాడు. ఈ విజ‌యంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు బ‌ర్మింగ్ హామ్ లో జూలై 2 నుంచి జ‌రుగుతుంది.

 

 

 

ఓపెన‌ర్ల అద్భుత జోరు..ఐదోరోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 21/0 తో రెండో ఇన్నింగ్స్ ను కొన‌సాగించిన ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు అద్భుతంగా ఆడారు. భారీ టార్గెట్ ను ఛేజ్ చేస్తున్న‌ప్ప‌టికీ, ఏమాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ‌గా ఆడారు. ముఖ్యంగా బెన్ డ‌కెట్ అద్భుతంగా ఆడి సూప‌ర్బ్ షాట్ల‌తో రెచ్చిపోయాడు. వీరిద్ద‌రూ భార‌త బౌల‌ర్ల‌పై ఒత్తిడి తెస్తూ, వేగంగా ప‌రుగులు సాధించారు. దీంతో 66 బంతుల్లోనే డ‌కెట్, 111 బంతుల్లో క్రాలీ అర్ధ సెంచ‌రీలు న‌మోదు చేశారు. ముఖ్యంగా ఒక‌ర‌క‌మైన ప్ర‌ణాళిక‌తో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ ను ఆచితూచి ఎదుర్కొన్న ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు.. మిగ‌తా బౌల‌ర్ల‌పై త‌మ ప్ర‌తాపం చూపించారు. 

ఇండియాపై రెండోసారి..లంచ్ విరామం వరకు ఒక్క వికెట్ కోల్పోకుండా 117 ప‌రుగులు చేసింది. లంచ్ త‌ర్వాత కూడా డ‌కెట్ జోరు కొన‌సాగింది. మ‌రో ఎండ్ లో క్రాలీ కూడా బ్యాట్ ఝ‌ళిపించాడు. వీరిద్ద‌రూ స‌త్తా చాట‌డంతో భార‌త బౌల‌ర్ల‌కు నిలువ‌రించ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. ఈ క్ర‌మంలో 121 బంతుల్లో సెంచ‌రీని పూర్తి చేసుకున్న డ‌కెట్.. ఆ త‌ర్వాత జోరు కొన‌సాగించాడు. ఈ ద‌శ‌లో వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ కాసేపు ఆగింది. విరామం త‌ర్వాత క్రాలీ వికెట్ ను ఇంగ్లాండ్ కోల్పోయింది. కాసేప‌టికే ఓలీ పోప్(8) కూడా ఔటవ‌డంతో భార‌త్ మ్యాచ్ లోకి వ‌చ్చింది. ఈ ద‌శ‌లో జో రూట్ (53 నాటౌట్) తో క‌లిసి డ‌కెట్ కాసేపు వికెట్లు ప‌డ‌కుండా కాపు కాశాడు. అయితే లార్డ్.. శార్దూల్ ఠాకూరు వ‌రుస బంతుల్లో డ‌కెట్, హేరీ బ్రూక్ లను ఔట్ చేసి భారత శిభిరంలో ఆశ‌లు రేపాడు. ఈ ద‌శ‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (33)తో క‌లిసి రూట్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఇద్ద‌రూ రివ‌ర్స్ స్వీప్, భిన్న‌మైన షాట్ల‌తో భార‌త బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచి 49 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత స్టోక్స్ వెనుదిరిగినా జేమీ స్మిత్ (44 నాటౌట్) తో క‌లిసి రూట్ జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. బౌల‌ర్ల‌లో ప్రసిధ్ కృష్ణ‌, శార్దూల్ రెండేసి వికెట్ల‌తో రాణించారు. గ‌తంలో 378 ప‌రుగుల టార్గెట్ ను ఛేజ్ చేసిన ఇంగ్లాండ్.. ఇండియాపై మ‌రోసారి 371 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.