భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. శ్రీలంకపై భారీ స్కోరు చేసి విజయంతో పాటు రన్‌రేట్‌ కూడా పెంచుకోవాలని బ్రిటీష్‌ జట్టు పట్టుదలగా ఉంది.  ఈ మ్యాచ్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్లు ప్రపంచకప్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పిచ్‌ కొంచెం నెమ్మదిగా ఉండడంతో భారీ స్కోరు చేయడమే కష్టమేనని మాజీలు అంచనా వేస్తున్నారు. 

 

వన్డే ప్రపంచకప్‌లో ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్‌.. శ్రీలంక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. సెమీస్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి. మరోసారి ప్రపంచకప్‌ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రారంభంలో అంచనా వేసిన బ్రిటీష్‌ జట్టు.. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. శ్రీలంక కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకూ శ్రీలంక నాలుగు మ్యాచ్‌లు అడి ఒక విజయం, మూడు పరాజయాలతో రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా అన్నే మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్‌ రెండే పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లంక కంటే తక్కువ రన్‌రేట్‌తో బ్రిటీష్‌ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాపై ఘోర  ఓటమితో బంగ్లాదేశ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని... ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని ముందుకు సాగాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. 

 

  బెంగళూరు చెన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలని ఇంగ్లండ్‌, లంక పట్టుదలగా ఉన్నాయి. అయితే సెమీస్‌ చేరే ఏ అవకాశాన్ని వదులుకోవద్దని బ్రిటీష్‌ జట్టు పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌, శ్రీలంక సెమీస్‌ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంది. అలా అయితేనే 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో కఠినమైన ప్రత్యర్థులను ఇరు జట్లు ఎదుర్కోవాల్సి ఉంది. కానీ ఒకసారి ఫామ్‌ అందుకుంటే ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమని మాజీలు విశ్లేషిస్తున్నారు. వరస పరాజయాలతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు ఈ విజయం అత్యవసరం. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ నుంచి బ్రిటీష్‌ జట్టు భారీ స్కోరు ఆశిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్‌ బట్లర్ ఇప్పటివరకూ బ్యాట్‌తో రాణించలేదు. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్‌ మరోసారి ఫామ్‌ను అందిపుచ్చుకుంటే ఇంగ్లండ్‌కు తిరుగుండదు. కానీ బ్రిటీష్‌ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ కూడా అంచనాల మేర రాణిస్తే లంకపై గెలుపు బ్రిటీష్‌ జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన లంక స్పిన్‌ను ఇంగ్లండ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

 

శ్రీలంక పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. సెమీస్‌ చేరాలంటే లంక అన్ని మ్యాచులు గెలవాల్సిందే. భారత్, న్యూజిలాండ్‌లతో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో లంక సెమీస్‌ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని లంక క్రికెటర్లు భావిస్తున్నారు. కుశాల్ మెండిస్స, సదీర సమరవిక్రమ, దిల్షాన్ మధుశంకపై లంక ఆశలు పెట్టుకుంది. కుశాల్‌ మెండీస్‌ ఈ ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై 42 బంతుల్లో 76, పాకిస్తాన్‌పై 65 బంతుల్లో సెంచరీ చేశాడు. వీళ్లు రాణిస్తే ఇంగ్లండ్‌పై గెలుపు పెద్ద కష్టం కాదని శ్రీలంక భావిస్తోంది. మతీషా పతిరానా స్థానంలో ఏంజెలో మాథ్యూస్‌, లహిరో కుమారా తుది జట్టులోకి వచ్చారు. 

 

ఇంగ్లండ్ ఫైనల్‌ 11: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, మోయిన్ అలీ, క్రిస్‌ వోక్స్‌. డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

 

శ్రీలంక ఫైనల్‌ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్) ,సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాధ్యూస్‌,  మహాన తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక, లహీరో కుమారా