భారత మహిళా క్రికెట్‌ జట్టు నూతన హెడ్‌ కోచ్‌గా దేశవాళి మాజీ క్రికెటర్‌ అమోల్‌ ముజుందార్‌ నియమితులయ్యారు. సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపేలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్‌ అడ్వయిజరీ కమిటీ ముజుందార్‌ను సీనియర్‌ మహిళల టీమ్‌ కొత్త హెడ్‌కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ అడ్వయిజరీ కమిటీ  కొన్ని నెలల క్రితమే ప్రధాన కోచ్ పదవికి వచ్చిన దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. తాజాగా ఇప్పుడు ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం.. క్రికెట్‌ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా ముజుందార్‌ వైపు మొగ్గింది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. టీమిండియా ఉమెన్స్ హెడ్‌ కోచ్‌ పదవి చాలాకాలంగా పెండింగ్‌లో ఉండగా తాజాకా ఆమోల్‌ మజుందార్‌ను నియమించారు.
 పూర్తిగా ఆలోచించిన తర్వాత, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని  ముగ్గురు సభ్యుల క్రికెట్‌ అడ్వయిజరీ కమిటీ... భారత మహిళా క్రికెట్‌ జట్టు నూతన హెడ్‌ కోచ్‌గా అమోల్‌ ముజుందార్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ప్రకటించింది.



మాజీ కోచ్‌ రమేశ్ పొవార్... స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరిన తర్వాత.. హృషికేష్ కనిత్కర్‌ మహిళల హెడ్‌ కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులవ్వడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తనపై నమ్మకం ఉంచినందుకు క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ, BCCIకి  కృతజ్ఞతలు తెలుపుతున్నాని మజుందార్‌ తెలిపారు. ఇది చాలా పెద్ద బాధ్యతని, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి, వారికి సరిగ్గా సిద్ధం చేసేందుకు, మార్గనిర్దేశం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మజుందార్‌ అన్నారు. మజుందార్‌ హెడ్‌ కోచ్‌గానే టీమిండియా మహిళల జట్టు రెండు ప్రపంచకప్‌లు ఆడనుంది. వచ్చే రెండేళ్లలో టీమిండియా ఉమెన్స్‌ టీం రెండు రెండు ప్రపంచ కప్‌లు ఆడనుందని.. ఇది చాలా కీలక సమయమని  మజుందార్‌ అన్నారు. కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రణాళిక రచిస్తామని వెల్లడించారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా అమోల్‌ ముజుందార్‌ నియమితులు కావడంతో ఇప్పటివరకూ తాత్కలిక కోచ్‌గా  బాధ్యతలు నిర్వర్తించిన హృషికేష్ కనిత్కర్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీకి తిరిగి వెళ్లనున్నాడు. పురుషుల A జట్టుతో లేదా వచ్చే ఏడాది శ్రీలంకలో జూనియర్ ప్రపంచ కప్ ఆడబోయే U-19 జట్టుతో కనిత్కర్‌ కలవిసి పనిచేసే అవకాశం ఉంది. 



 ఆధునిక క్రికెట్‌పై ముజుందార్‌కు ఉన్న పరిజ్ఞానం అతన్ని మహిళల టీం హెడ్‌ కోచ్‌గా నియమించడానికి ఉపయోగపడిందని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. BCCI మహిళల క్రికెట్‌ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న జైషా.. మైదానంలో , వెలుపల జట్టు రాణించడానికి అవసరమైన వాతావరణాన్ని అందిస్తామని వెల్లడించారు. బీసీసీఐ తరపున ముజుందార్‌కు పూర్తి మద్దతు ఉంటుందని జైషా అన్నారు. టీమిండియా మహిళల హెడ్‌ కోచ్‌గా ముజుందార్ ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఒక ప్రకటనలో తెలిపారు.  


అమోల్‌ ముజుందార్‌ భారత దేశవాలీ క్రికెట్‌లో తన 21 ఏళ్ల కెరీర్‌లో 171 మ్యాచ్‌లు ఆడిన ముజుందార్‌ మొత్తం 11 వేలపైగా పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి.  ముంబై , అస్సాం, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కూడా ఆడిన ముజుందార్‌.. టీమ్‌ సభ్యుడిగా పలు రంజీ ట్రోఫీలు గెలిచాడు. 100కు పైగా లిస్ట్ A మ్యాచ్‌లు.. 14 T20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 21 ఏళ్లు దేశవాలీ క్రికెట్‌ ఆడిన ముజుందార్‌కు భారత జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం రాలేదు.