ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆరంభంలో రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. అది కూడా ఘోరంగా. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై 199 పరుగులకే కంగారులు కుప్పకూలగా.. టీమిండియా 41 ఓవర్లలో 4 వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తర్వాత దక్షిణాఫ్రికాపై కంగారులు ఘోరంగా ఓడిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 311 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా కేవలం 177 పరుగులకే కుప్పకూలారు. ఈ రెండు ఓటములతో ఓ దశలో ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో కంగారులు చిట్ట చివరి స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా ఆట చూసి అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన జట్టు ఇదేనా అని చాలామంది పెదవి విరిచారు. ఈసారి కంగారులు సెమీస్‌కు వెళ్లటమే కష్టమని విమర్శించారు. కంగారు జట్టు మరో వెస్టిండీస్‌లా మారిపోతున్నట్లు ఉందని ఘాటు విమర్శలు కూడా చేశారు.  అయ్యో ఒకప్పుడు బరిలోకి దిగితేనే ప్రత్యర్థి జట్లను వణికించే జట్టు ఇలా అయిపోయిందేంటి  అని బాధపడిన క్రికెట్‌ ప్రేమికులు ఉన్నారు. 

 

ఈ ఓటముల నుంచి తేరుకుని కంగారులు మళ్లీ విజయాల బాట పట్టారు. అది అలా ఇలా తేరుకోలేదు. ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో తమను ఎందుకు ప్రమాదకర జట్టు అంటారో  తెలిపేలా... ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపేలా కంగారులు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. శ్రీలంకపై గెలుపుతో ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లో విజయాల బోణి కొట్టిన ఆసిస్‌ జట్టు... పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌పై విధ్వంసమే సృష్టించింది. సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటూ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంటూ మరో ప్రపంచకప్‌ను కైవసం చేసుకునే దిశగా కంగారులు అడుగులు వేస్తున్నారు. 

 

దూకుడైన ఆటతీరుతో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియన్లు ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమించేశారు. ఇప్పటివరకూ అయిదు మ్యాచ్లు అడిన కంగారులు మూడు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉన్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో టీమిండియా, రెండో స్థానంలో న్యూజిలాండ్‌, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. పాకిస్థాన్‌ అయిదో స్థానంలో కొనసాగుతోంది. 

 

బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ కంగారులు రాణిస్తున్నారు. మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ కంగారు జట్టుకు అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. వార్నర్‌ వరుసగా రెండో శతకాలతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రు. లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లోకి వచ్చారు. మ్యాక్స్‌వెల్‌  నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. జోష్‌ ఇంగ్లిస్‌ కూడా సమయోచితంగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో జంపా 13 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాక్‌, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో జంపా సత్తా చాటి ప్రత్యర్థి తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసిస్‌ పేస్‌ త్రయం మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌, హెజిల్‌వుడ్‌కు తోడు స్టోయినిస్‌, మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, జంపాలతో కంగారుల బౌలింగ్ బలంగా ఉంది. 

 

అయితే  ఆస్ట్రేలియా ఇప్పటివరకూ గెలిచిన మూడు మ్యాచుల్లో పాకిస్థాన్‌ మినహా శ్రీలంక, నెదర్లాండ్స్  పసికూనల కిందే లెక్క. పాక్‌ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు రాణించడంతో ఆసిస్‌కు తిరుగులేకుండా పోయింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు సాధించి కంగారులు విజయం సాధించారు. కానీ ఆసిస్‌కు అసలైన సవాలు ముందు ముందు ఎదురుకానుంది. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టిస్తున్న అఫ్గానిస్థాన్‌లతో ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచుల్లో ఓడినా మళ్లీ కంగారులకు సెమీస్‌ ఆశలు సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. కానీ కంగారూలు ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే ఆ జట్టును ఆపడం కష్టమే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ ప్రపంచకప్‌లో ఆసిస్‌ ఇలాగే రాణిస్తుందో... మళ్లీ చతికిలపడుతుందో తెలియాలంటే మరో రెండు మ్యాచ్‌లు వేచి చూడాల్సిందే.