ENG vs AFG: ప్రపంచకప్‌లో ఆదివారం డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లడ్, పసికూన ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. న్యూ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్, ఒకదాంట్లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు మ్యాచ్‌కు తేరుకున్న ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌పై విజయంతో పుంజుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ గెలిచి మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.


ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి సంచలనం సృష్టించాలని ఆఫ్ఘన్ చూస్తోంది. గత రెండు ప్రపంచకప్ పోటీల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలోను ఇంగ్లండ్ విజయదుందుభి మోగించింది. 2019లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్‌లో పైకి రావాలని చూస్తోంది.  


బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్ జట్టు బలంగా కనిపిస్తోంది. జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ మలన్‌, జో రూట్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చే అంశం. వీరు క్రీజ్‌లో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ డేవిడ్ మలన్ (140) విధ్వంసం సృష్టించాడు. బెయిర్‌స్టో (52) జో రూట్ (82) చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ గాడిలో పడినట్లే.  బ్యాటర్లకు తోడు బ్రిటిష్ బౌలర్లు సైతం తమ సత్తా చాటుతున్నారు.  పేసర్‌ టాప్లీ, వోక్స్ మంచి బౌలింగ్ చేస్తున్నారు. బంగ్లాతో టాప్లీ నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సామ్‌కరన్‌, మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ ఇంగ్లండ్‌కు అదనపు బలంగా కనిపిస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగే తప్ప ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కష్టమే.


ఇంగ్లాండ్ Vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ వివరాలు 
ప్రపంచకప్‌ పోటీల్లో 13వ మ్యాచ్ ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. 


మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానెళ్లు 
స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ,  స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ ఛానెళ్లలో మ్యాచ్ చూడొచ్చు.


మొబైల్లో, స్మార్ట్ టీవీల్లో ఎలా చూడాలి?
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగే ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌ను మొబైల్ ఫోన్లలో డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. కానీ లాప్‌టాప్, స్మార్ట్ టీవీల్లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.  


మ్యాచ్ వివరాలు
పోటీ పడే జట్లు్: ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్
ఎక్కడ: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం
ఎప్పుడు: ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు