స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది విశ్వ సమరంలో పాక్ పై టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర నిరాటంకంగా సాగుతోంది దాయాదుల పోరులో టీమిండియా మరోసారి  పాక్ ను చిత్తు చేసింది లక్ష మంది ప్రేక్షకుల మధ్య దాయదిని చిత్తుగా ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.


సమయం మారింది కానీ విజయం మారలేదు. అదే జోష్‌.. అదే జోరు.. అదే ఆట.. అదే ఫలితం. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టుపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. గత  7 వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌పై గెలిచిన భారత్.. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా  కొనసాగించింది.  మ్యాచ్లో అదరగొట్టి , పాక్ ని చిత్తు చేసి  లీడ్‌ను 8-0కు పెంచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత బౌలింగ్‌లో  పాక్ ను బాగా కట్టడి చేసింది  టీమిండియా. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్‌ విలవిల్లాడింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌ విసిరే బంతులను ఎదుర్కోలేక జట్టులోని ఆరుగురు బ్యాటర్‌లు రెండంకెల స్కోర్‌ కూడా చేయకుండా పెవిలియన్‌ బాటపట్టారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండానే పాక్‌ తన ఇన్నింగ్స్‌ను ముగించింది. తరువాత బ్యాటింగ్‌లోనూ టీ20 తరహా ఆటతో చెలరేగిపోయింది. దీంతో వన్డే ప్రపంచకప్‌ 2023లో విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86) మరోసారి చెలరేగిపోవడంతో పాకిస్థాన్‌ నిర్దేశించిన 192 స్వల్ప  పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది. 


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ప్రారంభ  దశలో పటిష్ట స్థితిలో నిలిచిన పాక్..తరువాత రాను రాను  ఒత్తిడికి చిత్తయి వికెట్లు సమర్పించుకుంది. కేవలం 36 పరుగులు మాత్రమే జోడించి చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ ఆజమ్‌ ఒక్కడే హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 42.5 ఓవర్లలో పాకిస్థాన్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.


అనంతరం స్వల్వ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు.. పాకిస్థాన్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. వచ్చీరాగానే 4 ఫోర్లు కొట్టి.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ ఆ ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్‌ కోహ్లీ (16) సైతం త్వరగానే ఔట్‌ అయ్యాడు. 


అయితే అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌లోనూ తన జోరు కొనసాగించాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి  చెలరేగిపోయాడు. టీ20 తరహా బ్యాటింగ్‌ చేస్తూ.. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారత్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే అప్పటికే 6 సిక్సులు, 6 ఫోర్లు కొట్టిన రోహిత్‌ శర్మ, 21వ ఓవర్ లో షాహిన్ షా అఫ్రిది వేసిన నాలుగో బంతిని మిడ్ వికెట్ మీదుగా పంపడంతో నేరుగా ఇఫ్లికార్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.  దీంతో సెంచరీకి మరో 14 పరుగుల ముందే నిరాశగా పెవిలియన్ చేరాడు. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ (53), కేఎల్‌ రాహుల్‌ (19)లు లాంఛనం పూర్తి చేశారు.


ఈ మ్యాచ్‌ విజయంతో భారత్‌.. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచినట్లయింది.  భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.