England vs West Indies: వెస్టిండీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో కెప్టెన్ జోస్ బట్లర్ మ్యాజిక్ చేశాడు. చెస్టర్-లే-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో జోస్ బట్లర్ 59 బంతుల్లో 96 పరుగులు చేశారు. అతను కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో  ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. బట్లర్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ, అతని మెరుపు ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చింది. 

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్‌కు 188  పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 167/9 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌తో కెప్టెన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడితే ఇంగ్లాండ్ స్పిన్నర్ లియామ్ డాసన్ బంతితో ప్రత్యర్థులను వణికించాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన స్పెల్‌లో కేవలం 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. స్పిన్ మాయాజాలంతో మలుపు తిప్పిన డాసన్‌కు  'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' వరించింది.  బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్, లియామ్ డేంజరస్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

బట్లర్ మెరుపు ఇన్నింగ్స్

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభం చాలా పేలవంగా మొదలైంది.  రెండో ఓవర్లోనే బెన్ డకెట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్, జేమీ స్మిత్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పరుగులు పెంచడానికి ప్రయత్నించారు, కానీ మోతీ తన స్పెల్ తో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. గుడాకేష్ మోతీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతని స్పెల్‌లో పరుగులు కోసం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు. అతని బౌలింగ్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు అంటే అతను చేసిన అద్భుతం ఏంటో అర్థమవుతుంది. 

ఏడో ఓవర్ వరకు జాగ్రత్తగా ఆచితూచి ఆడిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తర్వాత గేర్ మార్చే ప్రయత్నం చేశారు. ఎనిమిదో ఓవర్లో రోమారియో షెపర్డ్ బౌలింగ్ స్మిత్‌ అవుట్ అయ్యాడు. ఓవైపు తరచూ వికెట్లు పడుతున్నా , జోస్ బట్లర్ కాన్‌సెంట్రేషన్ మాత్రం కోల్పోలేదు. ధాటిగా ఆడుతూ 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

12వ ఓవర్ వచ్చేసరికి ఇంగ్లాండ్ పవర్ హిట్టర్లందరూ కరేబియన్ బౌలర్ల చేతిలో పెవిలియన్ చేరారు. హ్యారీ బ్రూక్‌ను రోస్టన్ ఛేజ్ ఔట్ చేయగా, టామ్ బాంటన్‌ను ఆండ్రే రస్సెల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 116 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి బట్లర్ తన ఇన్నింగ్స్‌ను వేగవంతం చేశాడు. అతను షెపర్డ్ బంతిని అద్భుతంగా రివర్స్-స్వెట్ చేసి ఫోర్ కొట్టాడు. దీంతో 96 పరుగులకు చేరుకున్నాడు, సెంచరీ అవుతుందని అంతా అనుకన్నారు. కానీ అల్జారీ జోసెఫ్ అతన్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో సెంచరీ చేయకుండానే బట్లర్‌ ఇన్నింగ్స్ ముగిసింది. అతను షార్జాలో 2021 ప్రపంచ కప్ తర్వాత తన మూడో టీ20 సెంచరీని కోల్పోయాడు.

లియామ్ డాసన్ స్పిన్‌లో చిక్కుకున్న కరేబియన్ బ్యాట్స్‌మెన్

189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ప్రారంభంలో చాలా దూకుడుగా కనిపించింది. స్పిన్నర్స్ రంగంలోకి దిగడంతో  వారి ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఇంగ్లాండ్ అత్యంత ప్రభావవంతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ వెస్టిండీస్‌పై నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు.  అతను వెస్టిండీస్ బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. అతనితో పాటు ఇతర బౌలర్లు కూడా మంచి లైన్ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు, ఫలితంగా వెస్టిండీస్ జట్టు 167/9 పరుగులు చేసి ఆలౌట్ అయింది.