England Playing XI News: టీ20ల మాదిరిగానే మ్యాచ్ కు ఒకరోజు ముందే తుది జట్టును ప్రకటించే ఆనవాయితీని ఇంగ్లాండ్ జట్టు వన్డేలోనూ పాటించింది. శుక్రవారం నుంచి భారత్ తో నాగపూర్ లో జరిగే తొలి వన్డేకు 24 గంటల ముందే తుది జట్టును ప్రకటించింది. జట్టులో టీ20 సిరీస్ లో ఆడిన ప్లేయర్లే ఉండగా, వెటరన్ స్టార్ జో రూట్ చేరిక మాత్రమే కొత్తగా ఉంది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏటీ20 లీగ్ లో పార్ల్ రాయల్స్ తరపున పాల్గొని నేరుగా అక్కడి నుంచి ఇండియాకు రూట్ చేరుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలిసారి ఇంగ్లాండ్ తరపున రూట్ బరిలోకి దిగనున్నాడు.  5 టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ 4-1తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని మనసులో నుంచి తీసేసి, వన్డేల్లోనూ అగ్రెసివ్ గా ఆడుతామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. భారత కుర్రాళ్ల దాటికి ఇంగ్లాండ్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. 






తొలి ఓటమి..
ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి, బజ్ బాల్ ఆటతో ప్రకంపనలు రేపిన న్యూజిలాండ్ బ్రెండన్ మెకల్లమ్ కు ఇంగ్లాండ్ జట్టు వైట్ బాల్ హెడ్ కోచ్ గా తొలి సిరీస్ లోనే చుక్కెదురైంది. భారత్ తో జరిగిన సిరీస్ ను ఓడిపోవడం సెట్ బ్యాకే. సాధ్యమైనంత త్వరగా దీన్ని మర్చిపోయి వన్డే సిరీస్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక అనుభవజ్ఞుడైన జో రూట్ తిరిగి రావడం ఇంగ్లాండ్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. ఇక వన్డేల్లోనూ దూకుడుగా ఆడి, ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతామని పేర్కొన్నాడు. వన్డేల్లో ప్రత్యర్థులు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండు, వరుస విరామాల్లో వికెట్లు తీయడానికి వ్యూహాలు రచించామని, వాటిని అమల్లో పెట్టాల్సి ఉందని పేర్కొన్నాడు. 


జట్టు కూర్పు ఇలా..
భారత్ తో జరిగిన టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ కూర్పు ఉండబోతోంది. మూడో నెంబర్లో జో రూట్ ఆడటం, బట్లర్ స్థానం మార్పు మాత్రమే కీలకాంశాలుగా ఉన్నాయి. ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ లో జో రూల్, మిడిలార్డర్లో వరుసగా హారీ బ్రూక్, జోస్ బట్లర్ ఆడతారు. ఆల్ రౌండర్ల కోటాలో లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్ బరిలోకి దిగుతారు. పేసర్లుగా బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, సాఖిబ్ మహ్మూద్ ఆడతారు. జట్టులో ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ బరిలోకి దిగుతాడు. ఈనెల 6న నాగపూర్ , 9న కటక్, 12న అహ్మదాబాద్ లో వరుసగా మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కు భారత్ తరపున రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి చాలామంది ఆటగాళ్లు వన్డే జట్టుతో చేరారు. టీ20 జట్టుతో పోలిస్తే వన్డే జట్టులో దాదాపు 6,7 మంది ప్లేయర్లు కొత్తగా బరిలోకి దిగుతారు. 


Also Read: Rohit Vs BCCI: ఒత్తిడిలో రోహిత్.. భవిష్యత్తు ప్రణాళికలపై ప్రశ్నించిన బోర్డు.. మెగాటోర్నీ వరకు సమయం అడిగిన హిట్ మ్యాన్