Ind Vs Eng 2nd Test Latest Updates:  ఆన‌వాయితీ ప్ర‌కారం మ్యాచ్ కు రెండ్రోజుల ముందుగానే ఇంగ్లాండ్ త‌మ ప్లేయింగ్ లెవ‌న్ ను ప్ర‌క‌టించింది. తొలి టెస్టులో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతోంది. అయితే ఇంగ్లాండ్ తాజా నిర్ణయం ప‌లువురిని ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. రెండోటెస్టు కోసం ప్ర‌క‌టించిన స్క్వాడ్ లో ప్రీమియ‌ర్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ పేరును చేర్చ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే అందుబాటులో  ఉన్న అతడిని రెండో టెస్టులో ఆడించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. త‌ను పూర్తి ఫిట్ గా లేడా..? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. నిజానికి తొలి టెస్టులో అంత‌గా అనుభ‌వం లేని పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగి, భారీగా ప‌రుగులను ఇంగ్లాండ్ స‌మ‌ర్పించుకుంది. తొలి వికెట్ ను తొలి ఇన్నింగ్స్ లో తీయ‌డంలో ఇంగ్లాండ్ పేస‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ఈక్ర‌మంలో తొలి ఇన్నింగ్స్ లో 6 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యాన్ని కూడా భార‌త్ కు కోల్పోయింది. బ్యాట‌ర్ల పుణ్యామా అని 371 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌డంతో ఆ మ్యాచ్ ను ఇంగ్లాండ్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇక రెండో టెస్టుకి ఆర్చ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో అత‌డిని క‌చ్చితంగా ఆడిస్తార‌ని అంతా, అనుకున్నా, తాజాగా అత‌డిని బెంచ్ కే ప‌రిమితం చేశారు. 

కౌంటీల్లో పాల్గొని..గ‌త కొంత‌కాలంగా ఆర్చ‌ర్ ప‌లు గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. తొలుత మోచేతి గాయం, ఆ త‌ర్వాత వెన్ను నొప్పితో చాలా కాలం క్రికెట్ కు దూర‌మ‌య్యాడు. చాలాకాలం కింద‌ట అంటే 2021 ఫిబ్ర‌వ‌రిలో త‌ను చివ‌రి సారిగా టెస్టు ఆడాడు. దాదాపు నాలుగేళ్లుగా త‌ను సుదీర్ఘా ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవ‌లే కాస్త ఫిట్ నెస్ సంత‌రించుకుని, కౌంటీల్లో స‌స్సెక్స్ త‌ర‌పున ఆడాడు. అందులో ఫ‌ర్వాలేద‌నిపించాడు. మునుపటి వేగం, లైన్ అండ్ లెంగ్త్ తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో అత‌డిని రెండో టెస్టు స్క్వాడ్ లోకి కూడా తీసుకున్నారు. అయితే తుదిజ‌ట్టులో మాత్రం చోటు కల్పించ‌లేదు. తొలి టెస్టులో నెగ్గిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగాల‌ని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుండ‌టంతో ఎలాంటి మార్పులు లేని జ‌ట్టుతో ఇంగ్లీష్ జ‌ట్టు ఆడుతోంద‌ని తెలుస్తోంది. ఇక ఎడ్జ్ బాస్ట‌న్ లో జ‌రిగే ఈ రెండో టెస్టులో ఇరుజ‌ట్లు గెలుపే టార్గెట్ గా బ‌రిలోకి దిగుతున్నాయి. 5 టెస్టుల ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ లో మరింత ప‌ట్టు సాధించాల‌ని చూస్తోంది. ఇక ఇండియా ఈ మ్యాచ్ లో నెగ్గి, సిరీస్ స‌మం చేయాల‌ని భావిస్తోంది. 

ఇండియాతో రెండోటెస్టుకు ఇంగ్లాండ్ జ‌ట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డ‌కెట్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్‌, జో రూట్, హేరీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్), క్రిస్ వోక్స్, జోష్ టంగ్, బైడెన్ కార్స్, షోయ‌బ్ బ‌షీర్.