IND vs ENG 2nd Test 2025:  జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు టెస్ట్ సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. తప్పులను నుంచి నేర్చుకుని, జట్టు రెండవ టెస్ట్‌లో విజయంతో కమ్ బ్యాక్ చేయాలని భావిస్తోంది. మొదటి టెస్ట్‌లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

Continues below advertisement

లీడ్స్ లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇదే ఊపులో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా..

Continues below advertisement

టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అతడు 46 ఇన్నింగ్స్‌లలో టెస్ట్ క్రికెట్‌లో 50 సిక్సర్లు బాదేశాడు. యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే, భారత టెస్ట్ క్రికెట్‌లో 38 ఇన్నింగ్స్‌లలో 40 సిక్సర్లు కొట్టాడు. అతను 10 సిక్సర్లు కొడితే విధ్వంసకర బ్యాటర్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్ధలుకొట్టి సరికొత్త లిఖించుకోవచ్చు.

యశస్వి జైస్వాల్ టెస్ట్ రికార్డు ఇంగ్లండ్‌పై బాగానే ఉంది. అతను ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టాడు. అతను ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టాడు. అతను రెండవ టెస్ట్‌లో కూడా 10 సిక్సర్లు కొట్టకపోయినా, అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడానికి అవకాశం ఉంది. అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాలంటే జైస్వాల్ తరువాత 7 ఇన్నింగ్స్‌లలో 10 సిక్సర్లు కొడితే సరి.

రోహిత్ శర్మను దాటేయడం దాదాపు ఖాయం

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన రెండవ బ్యాటర్‌గా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి హిట్ మ్యాన్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను 51 ఇన్నింగ్స్‌లలో 50 టెస్టు సిక్సర్లను చేరుకున్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్‌ను యశస్వీ జైస్వాల్ దాటేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జైస్వాల్ ఇప్పటివరకు టెస్టుల్లో 20 మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. ఈ టెస్టులో రాణిస్తే అతను 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకుంటాడు. టెస్టుల్లో జైస్వాల్ ఇప్పటివరకు 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో ఎప్పుడూ గెలవని టీమ్ ఇండియా

భారత్ ఇంతకు ముందు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 8 టెస్టులు ఆడగా, అందులో ఇంగ్లండ్ 7 గెలిచింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుభ్‌మన్ గిల్ అండ్ టీమ్ ఈ టెస్ట్‌ను గెలిస్తే, ఈ స్టేడియంలో భారత్‌కు ఇదే తొలి విజయం కానుంది. తొలి టెస్టులో భారత్ నుంచి 5 శతకాలు నమోదైనా.. లోయర్ ఆర్డర్ అంతగా రాణించకపోవడం, కరుణ్ నాయర్, జడేజా బ్యాటింగ్ లో స్కోరు చేయకపోవడం జట్టుకు మైనస్ అయ్యాయి. బౌలింగ్ అటాక్ అంత స్ట్రాంగ్ గా కనిపించడం లేదు. జస్ప్రిత్ బుమ్రా పర్వాలేదనిపిస్తున్నాడు. రెండో టెస్టులో భారీ మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.