ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరగనున్న వన్డే మ్యాచ్ కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బెన్ స్టోక్స్ ఈ ప్రకటన చేశాడు.


‘మంగళవారం డర్హమ్‌లో జరగనున్న వన్డే మ్యాచ్ నా కెరీర్‌లో చివరిది. ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఇంగ్లండ్‌తో నా జట్టుతో ఆడిన ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేశాను. మేమంతా ఎంతో గొప్ప ప్రయాణం చేశాం.’ అని బెన్ స్టోక్స్ తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నాడు.


దీంతో టెస్టులు, టీ20లపై మరింత దృష్టి పెట్టనున్నాను. జోస్ బట్లర్, మాథ్యూ మాట్, ఇతర ఆటగాళ్లకు సపోర్ట్ స్టాఫ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. అలాగే ఇంతవరకు తనను సపోర్ట్ చేసిన ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. మంగళవారం జరుగుతున్న నా ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఆశిస్తున్నానన్నాడు.


తన కెరీర్‌లో 104 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్ 2,919 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 74 వికెట్లు తీసుకున్నాడు. తన కెప్టెన్సీ‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.