ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 42.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిషబ్ పంత్ (125 నాటౌట్: 113 బంతుల్లో, 16 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించాడు.


హార్దిక్ హవా...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (0: 3 బంతుల్లో), జో రూట్‌లను (0: 3 బంతుల్లో) సిరాజ్ ఒకే ఓవర్లో డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. అయితే జేసన్ రాయ్ (41: 31 బంతుల్లో, ఏడు ఫోర్లు), బెన్ స్టోక్స్ (27: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ముఖ్యంగా జేసన్ రాయ్ భారత బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా... జేసన్ రాయ్, బెన్ స్టోక్స్‌లను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ (34: 44 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు చేశారు. త్వరగా వికెట్లు పడటంతో తమ సహజ శైలికి భిన్నంగా వీరిద్దరూ కొంచెం ఓపికగా ఆడారు. అయితే కీలక సమయంలో రవీంద్ర జడేజా మొయిన్ అలీని అవుట్ చేసి వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు.


అనంతరం జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (27: 31 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. క్రీజులో నిలదొక్కుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్‌లను ఒకే ఓవర్లో అవుట్ చేసి ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు.


కానీ ఇంగ్లండ్ టెయిలెండర్లు కూడా భారత బౌలర్లను సమర్థ్యంగా ఎదుర్కొన్నారు. డేవిడ్ విల్లీ (18: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), క్రెయిగ్ ఓవర్టన్‌లు (32: 33 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం చివరి వరుస బ్యాట్స్‌మెన్ సంగతి చాహల్ చూసుకున్నాడు. 12 పరుగుల వ్యవధిలో ముగ్గురినీ అవుట్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.


పంత్ పంతం...
260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డు మీద 21 పరుగులు చేరేసరికి ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అవుటయ్యారు. ఫాంలో లేని కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో టీమిండియా 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగాడు. రిషబ్ పంత్ తనకు చక్కటి సహకారం అందించాడు. పాండ్యా అవుటయ్యాక రిషబ్ పంత్ విధ్వంస కరంగా ఆడాడు. రవీంద్ర జడేజాతో ఆరో వికెట్‌కు 56 పరుగులు జోడించగా... అందులో జడ్డూ వాటా కేవలం ఏడు పరుగులు మాత్రమే. దీంతో టీమిండియా 42.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.