England Team Virus Attack:  రేపు ఇంగ్లండ్- పాకిస్థాన్ మధ్య జరగవలసిన తొలి టెస్ట్ వాయిదా పడే అవకాశం కనపడుతోంది. ఆ జట్టు కెప్టెన్ స్టోక్స్ సహా మరికొంతమంది ఆటగాళ్లు గుర్తుతెలియని వైరల్ ఇన్ ఫెక్షన్ కు గురవ్యడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 


 సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లీష్ జట్టు పాక్ పర్యటనకు వచ్చింది. 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఆడబోతోంది. గురువారం నుంచి మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డారని పాక్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని... త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని ఈసీబీతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. 






తమ ఆటగాళ్లు అస్వస్థతకు గురైన విషయం నిజమేనని ఇంగ్లాండ్‌ మాజీ  కెప్టెన్‌ ఒకరు తెలిపారు. అయితే మ్యాచ్‌ కు ముందు జట్టులో ఏవైనా మార్పులు చేస్తారా? అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఈసీబీ ప్రతినిధి డానీ రూబెన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఏడుగురు ఆటగాళ్లు సహా తమ బృందంలోని 14 మంది వరకు వైరస్‌ బారినపడ్డారు. అయితే, ఇది ఫుడ్‌ పాయిజన్‌, కరోనాకు సంబంధించినది కాదు’’ అని తెలిపాడు. 






బుధవారం ఉదయం జరగాల్సిన సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూర్పుపై ఆ దేశ మాజీ కెప్టెన్ జో రూట్ స్పందిస్తూ.. కొంతమంది ఆటగాళ్లు సంపూర్ణస్థాయిలో సిద్ధంగా లేరని అన్నాడు. అయితే ఏయే ఆటగాళ్లు రెడీగా విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.బుధవారం కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ప్రాక్టీస్‌ చేశారు. ఇప్పటివరకు పీసీబీ, ఈసీబీలు మ్యాచ్‌ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆటగాళ్లకు సోకిన వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరమని తెలిస్తే మాత్రం సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆటగాళ్లను హోటల్‌లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఇంగ్లాండ్​ జట్టు ప్రతినిధి డానీ రూబెన్ తెలిపారు.