IND vs NZ 3rd ODI:  భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే వర్షార్పణం అయ్యింది.  టీ20 సిరీస్ కు ఆటంకం కలిగించిన వరుణుడు వన్డే సిరీస్ ను వదల్లేదు. ఇప్పటికే వర్షం వల్ల రెండో వన్డే రద్దవగా.. ఇప్పుడు మూడో వన్డే కూడా ఫలితం తేలకుండానే రద్దయింది.  దీంతో 1-0తో కివీస్ సిరీస్ ను గెలుచుకుంది. 

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అయ్యాక వాన మొదలయ్యింది. దీంతో ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకూ తగ్గకపోవటంతో మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.  220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ అర్ధశతకం అందుకున్నాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు. 

ఈ మ్యాచులో బంతి, బ్యాటుతో కివీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒకవేళ వర్షం రాకపోయింటే ఆ జట్టు గెలిచేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట బంతితో టీమిండియా బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అనంతరం బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై కూడా ఆ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నాడు. 

 

భారత బ్యాటర్ల కట్టడి

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి వన్డేలో శుభారంభం అందించిన భారత ఓపెనర్లు ఈ మ్యాచులో నిరాశపరిచారు.  శుబ్‌మన్ గిల్ కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 28 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన కెప్టెన్ శిఖర్ దావన్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా 55 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా త్వరగానే వికెట్ పారేసుకున్నాడు. ఫామ్ లేక తంటాలు పడుతున్న రిషబ్ కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చి సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగ్‌లో మిల్నే‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మరోవైపు క్రీజులో నిలదొక్కుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ (49) అర్ధశతకానికి అడుగు దూరంలో ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తర్వాత దీపక్ హుడా (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రాగానే 2 సిక్సులు కొట్టిన దీపక్ చాహర్ ఓ షార్ట్ పిచ్ బంతికి ఔటయ్యాడు.

సుందర్, చాహల్ ల భాగస్వామ్యం

ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ అడపాదడపా బౌండరీలు కొడుతూ, సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతనికి చాహల్ (8) చక్కని సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలో చాహల్, అర్హదీప్ ఔటయ్యారు. 48వ ఓవర్లో సౌథీ బౌలింగ్ లో సిక్స్ తో అర్ధశతకం పూర్తిచేసుకున్న వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత రెండో బంతికే ఔటయ్యాడు. దీంతో 219 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. 

న్యూజిలాండ్ బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీసుకోగా.. సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. శాంట్నర్, ఫెర్గూసన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.