భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండగానే పాకిస్థాన్ వెనుదిరిగింది. అఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం పాలై నాకౌట్ అవకాశాలను దూరం చేసుకున్న దాయాది దేశం... తర్వాత పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయంతో పాకిస్థాన్ స్వ దేశానికి పయనమైంది. పాక్ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్ అభిమానులు సహా అన్ని వైపుల నుంచి విమర్శల జల్లు కురుస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమమైన పేస్ దళంగా పేరొన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు తేలిపోయారు. షహీన్ షా అఫ్రిదీ తప్ప మిగిలిన పేసర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. మాములుగా బ్యాటర్లు 500 పరుగులు చేరుకుని రికార్డు సృష్టించారు. ఇక్కడ హరీస్ రౌఫ్ కూడా 500 పరుగులు చేరుకుని రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో 500కుపైగా రన్స్ సమర్పించుకున్న చెత్త బౌలర్‌గా రౌఫ్ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.
ఈ వరల్డ్‌కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హరీస్ రౌఫ్ ఏకంగా 533 పరుగులు సమర్పించుకున్నాడు. లీగ్ దశ పోటీల్లో ఆడిన 9 మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 16 వికెట్లు తీశాడు. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 533 పరుగులు ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఒక ఎడిషన్‌లో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరున ఈ చెత్త రికార్డు ఉండేది. ఆదిల్ రషీద్ 2019 ప్రపంచకప్‌లో 526 పరుగులిచ్చాడు. తాజా ఎడిషన్‌లో 533 పరుగులిచ్చిన హరీస్ రౌఫ్ ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీసినా 64 పరుగులు సమర్పించుకున్నాడు. నెదర్లాండ్స్‌పై 43, శ్రీలంకపై 64, భారత్‌పై 43, ఆస్ట్రేలియాపై 83, అఫ్ఘానిస్థాన్‌పై 53, సౌతాఫ్రికాపై 62, బంగ్లాదేశ్‌పై 36, న్యూజిలాండ్‌పై 85 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున 500కు పరుగులు చేసిన బ్యాటర్ ఎవరూ లేరు.
ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు ఇచ్చిన బౌలర్‌గానూ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో హరీస్ రౌఫ్ ఏకంగా 16 సిక్సులను సమర్పించుకున్నాడు. దీంతో 2015 వన్డే ప్రపంచకప్‌లో 15 సిక్సులిచ్చిన జింబాబ్వే బౌలర్ తినాషే పణ్యంగారా చెత్త రికార్డును హరీస్ రౌఫ్ బద్దలు కొట్టాడు. దీంతో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు ఇచ్చిన చెత్త బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 37 వన్డేల్లో 69 వికెట్లు తీసినప్పటికీ.. దాదాపు 6 ఎకానమీతో పరుగులిచ్చాడు. అసలే ఈ ప్రపంచకప్‌లో సెమీస్ చేరలేదనే బాధలో ఉన్న పాకిస్థాన్‌ను హరీస్ రౌఫ్ చెత్త రికార్డులు మరింత బాధిస్తున్నాయి.
2023 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ పరాజయంతో ముగించింది. సెమీస్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 93 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్... 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.