England Men's Third Ashes Test Squad: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతానికి 2-0 ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో జూలై 6వ తేదీ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.


మొయిన్ అలీ ఇన్... రెహాన్ అహ్మద్ అవుట్...
హెడింగ్లీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు చోటు దక్కలేదు. అదే సమయంలో స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని మూడో టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చేర్చారు.


మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు
బెన్ డకెట్, జాక్ క్రాలీ, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జో రూట్, జోష్ టంగ్, ఆలీ రాబిన్సన్, మోయిన్ అలీ , క్రిస్ వోక్స్ మరియు మార్క్ వుడ్.


రెండో టెస్టూ ఆస్ట్రేలియాదే
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 325 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను 279 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఈ క్రమంలో విఫలం అయి 327 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2023 యాషెస్‌ సిరీస్‌లో కంగారూ జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది.


అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 110, ట్రావిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. అదే సమయంలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 98, హ్యారీ బ్రూక్ 50 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజా అత్యధికంగా 77 పరుగులు చేశాడు.


యాషెస్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్టు: ఇంగ్లాండ్ v ఆస్ట్రేలియా, జూన్ 16–20, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో గెలిచింది)


2వ టెస్టు: ఇంగ్లండ్ v ఆస్ట్రేలియా, 28 జూన్-2 జూలై, లార్డ్స్, లండన్ (ఆస్ట్రేలియా 43 పరుగులతో గెలిచింది)


3వ టెస్టు: ఇంగ్లండ్ v ఆస్ట్రేలియా, జూలై 6-10, హెడ్డింగ్లీ, లీడ్స్


నాల్గవ టెస్ట్: ఇంగ్లాండ్ v ఆస్ట్రేలియా, జూలై 19-23, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్


ఐదో టెస్టు: ఇంగ్లండ్ v ఆస్ట్రేలియా, 27-31 కియా ఓవల్, లండన్.