2023 వన్డే వరల్డ్ కప్‌లో మొదటి సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై ఆప్ఘనిస్తాన్ 69 పరుగుల భారీ తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.


ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతని వన్ మ్యాన్ షో సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు సాధించారు.


హ్యారీ బ్రూక్ ఒక్కడే...
285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరుబోర్డుపై మూడు పరుగులు చేరేసరికి విధ్వంసక ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను (2: 4 బంతుల్లో) ఫజల్‌హక్ ఫరూకీ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను ఆఫ్ఘన్ ఎక్కడా కుదురుకోనివ్వలేదు. 35 పరుగులకు మించిన ఒక్క భాగస్వామ్యం కూడా ఇంగ్లండ్ నమోదు చేయలేకపోయింది. కంటిన్యుయస్‌గా ఆఫ్ఘనిస్తాన్ వికెట్లు తీస్తూనే ఉంది.


ఇంగ్లండ్ బ్యాటర్లు అందరిలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే రాణించాడు. అతను తప్ప మిగతా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివర్లో ఆదిల్ రషీద్ (20: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), మార్క్ వుడ్ (18: 22 బంతుల్లో, మూడు ఫోర్లు), రీస్ టాప్లే (15 నాటౌట్: 7 బంతుల్లో, మూడు ఫోర్లు) ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 40.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.


రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసం...
అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్‌కు దిగింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28: 48 బంతుల్లో, మూడు ఫోర్లు) ఆఫ్ఘనిస్తాన్‌కు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా గుర్బాజ్ ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. అతనికి చక్కటి సహకారం అందించిన ఇబ్రహీం జద్రాన్‌ను ఆదిల్ రషీద్ చక్కటి బంతితో అవుట్ చేశాడు. దీంతో 114 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది.


ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆఫ్ఘన్‌కు పెద్ద షాక్ తగిలింది. వన్‌‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా (3: 6 బంతుల్లో), క్రీజులో నిలదొక్కుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ వరుస బంతుల్లో అవుటయ్యారు. రహ్మత్‌ షాను ఆదిల్ రషీద్ అవుట్ చేయగా, లేని పరుగుకు ప్రయత్నించి రహ్మనుల్లా గుర్బాజ్ రనౌట్ అయ్యాడు.


అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తీసుకున్నాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఆఫ్ఘనిస్తాన్‌కు మంచి స్కోరు అందించాడు. కానీ ఆఖర్లో ఆఫ్ఘనిస్తాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial