Emotional Afghanistan Players: సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌... ఓ వైపు లిట్టన్‌ దాస్‌ రూపంలో ఓటమి తరుముకుంటూ వస్తుంది. బంగ్లా(BAN) విజయం వైపు దూసుకొస్తోంది. స్టేడియంలో... డగౌట్‌లో.. ఆటగాళ్లలో ఎన్నో భావోద్వేగాలు.. అఫ్గాన్‌(AFG) ఆటగాళ్లు, కోచ్‌లు... ప్రతీ బంతికి టెన్షన్‌ పడుతున్నారు. ఇక ఓటమి ఖాయమనుకుని కాసేపు... గెలుపు మనదే అనే ధీమా మరోవైపు... ఇలా అఫ్గాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. లిట్టన్‌ దాస్‌.. బంగ్లా బ్యాటర్లతో కలిసి ఓ మోస్తరు భాగస్వామ్యం నెలకొల్పిన ప్రతీసారి అఫ్గాన్‌ జట్టులో ఎక్కడలేని టెన్షన్‌ కనపడింది. వర్షం వచ్చిన ప్రతీసారి... ఎన్ని ఓవర్లు తగ్గించారు.. ఎన్ని పరుగులు చేయాలి ఇలా అనేక అంచనాలు వేస్తూ అఫ్గాన్‌ కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌... తన జట్టుకు సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇక బౌలింగ్ చ్‌ డ్వేన్‌ బ్రావో అయితే బౌండరీ బయట నిలబడి ప్రతీ బంతికి టెన్షన్‌ పడుతూనే ఉన్నాడు. తుది జట్టులో స్థానం దక్కని అఫ్గాన్ ఆటగాళ్లు వికెట్‌ పడిన ప్రతీసారి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవ్వగా... బంగ్లా బౌండరీ కొట్టిన ప్రతీసారి టెన్షన్‌తో ఏడ్చినంత పనిచేశారు. ఒక్కసారి విజయం సాధించగానే రషీద్‌ ఖాన్‌ సహా... అఫ్గాన్ ఆటగాళ్లు ఆ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఒక్క విజయంతో అఫ్గాన్‌ టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. ఇక అఫ్గాన్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అఫ్గాన్‌... సెమీస్‌లో ఐసీసీ టోర్నీల్లో అత్యంత దురదృష్టకర జట్టుగా భావించే దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
  





రషీద్‌ ఖాన్‌ నడిపించగా...

బంగ్లాదేశ్‌తో జరిగిన  సూపర్ 8 ఎన్‌కౌంటర్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.  లిట్టన్‌దాస్ హాఫ్ సెంచరీతో బంగ్లాను గెలిపించేందుకు చివర వరకు ప్రయత్నించినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. రషీద్ ఖాన్, నవీనుల్‌ హక్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. మిగిలిన స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. లిట్టన్ దాస్ పట్టు బట్టి ఆడినా ఫలితం లేకపోయింది. మరోవైపు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగానే  మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అలాగే లక్ష్యాన్ని కూడా 114కు తగ్గించారు. అయినా  నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ లు చెరో నాలుగు వికెట్లు తియ్యడంతో  బంగ్లాదేశ్ కుదేలైపోయింది.





గుండె ఆగినంత పనికాలా

ఓ వైపు లిట్టన్‌ దాస్‌ పోరాడుతుండడంతో చివరి ఓవర్లలో... బంగ్లా లక్ష్యాన్ని ఛేధించేలా కనపడప్పుడు ప్రతీ బంతికి క్రికెట్‌ అభిమానులకు గుండె ఆగినంత పని అయ్యింది. చివరి నాలుగు ఓవర్లలో 21 పరుగులే చేయాల్సి ఉండడం ఆ తర్వాత కూడా బంగ్లా పోరాడడంతో ఇక అఫ్గాన్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండడం... బంతులు ఎక్కువగా ఉండడంతో అఫ్గాన్‌కు బంగ్లాను ఆలౌట్‌ చేయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. చివరి ఎనిమిది బంతుల్లో ఆరు పరుగులే చేయాల్సి ఉన్న దశలో నవీనుల్‌ రెండు వికెట్లు నెలకూల్చిన వెంటనే అఫ్గాన్ ఆటగాళ్లు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.