Duleep Trophy 2024 Highlights India A beats India C to lift title | అనంతపురం: దులీఫ్‌ ట్రోఫీ 2024 ఇండియా– ఏ జట్టు కైవసం చేసుకుంది. టోర్నీలో 12 పాయింట్లతో ఇండియా– ఏ జట్టు అగ్రస్థానంలో నిలిచి టోర్నీ విజేతగా నిలిచింది. 9 పాయింట్లతో ఇండియా– సీ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్‌ విలేజ్‌లో చివరి రౌండ్‌ మ్యాచ్‌లు ఆదివారం ముగిశాయి. ఇండియా ఏ జట్టు 132 పరుగులతో ఇండియా సీ జట్టుపై, ఇండియా డీ జట్టు 257 పరుగుల భారీ తేడాతో ఇండియా– బీ జట్టుపై విజయం సాధించాయి. ఇండియా బీతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా డీ బ్యాట్స్‌మెన్‌ అజేయ శతకం చేసిన రిక్కీభుయ్‌ (56, 119) అర్ధ సెంచరీ, సెంచరీ చేసి  ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


సాయిసుదర్శన్‌ సెంచరీ


ఇండియా ఏతో జరిగిన మ్యాచ్‌లో సీ జట్టు క్రీడాకారుడు సాయిసుదర్శన్‌ సెంచరీ సాధించాడు. ఇండియా సీ–తో జరిగిన మ్యాచ్‌లో ఏ జట్టు క్రీడాకారుడు శాశ్వత్‌ రావత్‌ (124, 53) సెంచరీ, అర్ధసెంచరీ సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇండియా సీ జట్టు క్రీడాకారులు అన్షుల్‌ కాంబోజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీరిస్‌గా(16 వికెట్లు, 41 పరుగులు) నిలిచాడు. టోర్నీ విజేత ఇండియా–ఏ జట్టుకు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌ బాబు విన్నర్స్‌ కప్‌ను అందజేశారు. రన్నర్స్‌కు మంత్రి పయ్యావుల కేశవ్‌ కప్‌ను అందజేశారు. స్టైకర్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు మంత్రి పయ్యావుల కేశవ్, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు సంబంధించి ఏ గ్రౌండ్‌లో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్, బి గ్రౌండ్‌లో ఏసీఏ అతిథి ఆర్‌.వి.ఎస్‌.కె. రంగారావ్‌ క్రీడాకారులకు చెక్కులను అందజేశారు.  


 రిక్కీ భుయ్‌ అజేయ శతకం, ఇండియా డీ భారీ విజయం: 


 ఇండియా బీతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా డీ జట్టు భారీ విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌  244/5తో ప్రారంభించిన ఇండియా డీ జట్టు 305 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తెలుగుతేజం రిక్కీభుయ్‌ అజేయ శతకం సాధించాడు. టోర్నీలో రిక్కీ భుయ్‌ రెండో సెంచరీ ఇది. చిరవి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనూ రిక్కీభుయ్‌ అర్ధ సెంచరీ సాధించిన విషయం విధితమే.  124 బంతులు ఎదుర్కొన్న రిక్కీ భుయ్‌ 15 ఫోర్టు, 3 సిక్సర్ల సహాయంతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా డీ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని ఇండియా బీ జట్టు ముందు 373 పరుగలు లక్ష్యాన్ని ఉంచింది.


 అర్ష్‌దీప్, థాకరే ధాటికి బీ జట్టు 115 పరుగులకు ఆలౌట్‌: 


 373 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా బీ జట్టు..ఇండియా డీ జట్టు బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్, ఆదిత్య థాకరే ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బీ జట్టుప విరుచుకుపడ్డారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 11.2 ఓవర్లలో 40 పరుగులిచ్చి 6 వికెట్లు, ఆదిత్య థాకరే 11 ఓవర్లలో 59 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇండియా బీ జట్టు 22.2 ఓవర్లలో కేవలం 115 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇండియా డీ జట్టు 257 పరుగుల భారీ తేడాతో బీ జట్టుపై గెలుపొందింది. 


 సాయిసుదర్శన్‌ సెంచరీ వృథా, ఇండియా ఏ జట్టు విజయం: 


 ఇండియా ఏ తో జరిగిన మ్యాచ్‌లో సీ జట్టు క్రీడాకారులు సాయి సుదర్శన్‌ సెంచరీ వృథా అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 270/6తో ప్రారంభించిన ఇండియా ఏ జట్టు మరో 16 పరుగులు జోడించి డిక్లేర్డ్‌ చేసింది. దీంతో ఇండియా సీ జట్టు ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ పరుగుల చేధనలో ఏ బౌలర్ల ధాటికి  సీ జట్టు క్రీడాకారులు నిలువలేకపోయారు. 81.5 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది ఇండియా సీ జట్టు. ఆ జట్టులో సాయిసుదర్శన్‌ ఒంటిరి పోరాటం చేశాడు. 206 బంతుల్లో 12 బౌండరీల సహాయంతో సాయిసుదర్శన్‌ 111 పరుగులు చేశాడు.  కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 44(5 ఫోర్లు)
వైశాక్‌ 17, ఇషాన్‌ కిషన్‌17 మినహా మిగితా వారు రెండంకెల స్కోర్‌ కూడా దాటలేకపోయారు. ఇండియా ఏ జట్టు బౌలర్లలో ప్రసిద్ద్‌కృష్ణ 3, తనుష్‌ కొటియన్‌ 3, అకీబ్‌ఖాన్‌2, సామ్స్‌ ములానీ వికెట్‌ తీసుకున్నారు. దీంతో ఇండియా ఏ జట్టు 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముగింపు కార్యక్రమంలో ఏసీఏ కౌన్సిలర్‌ డి.గౌర్‌ విష్ణు, గేమ్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌.కుమార్, కలెక్టర్‌ వినోద్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ శివ్ నారాయణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.


 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌.. శాశ్వత్‌ రావత్‌ (ఏ గ్రౌండ్‌),  రిక్కీ భుయ్‌ ( బి గ్రౌండ్‌ ) 


సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ద సీరిస్‌.. రిక్కీ భుయ్‌


 ప్లేయర్‌ ఆఫ్‌ ద సీరిస్‌.. అన్షుల్‌ కాంబోజ్‌