Drop in pitch for India vs Pakistan: టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup) అంటే బ్యాటర్ల విధ్వంసమే కళ్ల ముందు కదులుతుంది. భారీ సిక్సర్లు... వరుస బౌండరీలతో స్టేడియాలు హోరెత్తిపోతాయి. భారీ స్కోర్లు తేలిగ్గా నమోదవుతాయి. కానీ అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ అలాంటి మెరుపులేవీ కనిపించలేదు. ఆరంభంలో జరిగిన మూడు మ్యాచులు పసికూనల మధ్య కాబట్టి ఎవరు పిచ్‌ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీలంక(SL)- దక్షిణాఫ్రికా(SA) మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ బౌలర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో ఈ మ్యాచులు ఉసూరుమనిపించాయి. నమీబియా-ఒమన్‌ మధ్య జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఈ పిచ్‌లపై క్రికెట్‌ అభిమానులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.


 

మరీ ఇలానా..?

శ్రీలంక- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంతా అనుకున్నారు. కానీ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ పూర్తిగా బౌలర్లకే సహకరించింది. పేసర్లు, స్పిన్నర్లు చెలరేగిపోవడంతో ఇరువైపుల బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. లంక కేవలం 77 పరుగులకే కుప్పకూలగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా కూడా 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో ఎవరూ 25 పరుగుల మార్క్‌ను దాటకపోవడం విశేషం. టీ 20 ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లలో పిచ్‌లు ఉలా ఉండడంపై అభిమానలు పెదవి విరుస్తున్నారు. పసికూనలే కాకుండా అగ్రశ్రేణి జట్లు కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఇక్కడే

ఈ టీ 20 ప్రపంచకప్‌కే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌గా భావిస్తున్న ఇండియా-పాక్ (India versus Pakistan) పోరు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలోనే జరగనుంది. ఈ పిచ్‌పై పరుగులు రాక కష్టం అవ్వడంతో మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నసావు కౌంటీ స్టేడియంలో భారత్‌-పాక్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌పైకి రావడం లేదని టీ 20 క్రికెట్‌లో ఇది చాలా అరుదని మాజీలు అంటున్నారు. ఈనెల తొమ్మిదిన ఈ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీలు అంటున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లోనూ అదే జరిగితే అభిమానులకు నిరాశ తప్పదని అంటున్నారు. న్యూయార్క్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్లు భారీ స్కోరు చేయడం కష్టమేనని కూడా అంచనా వేస్తున్నారు. భారత జట్టు తొలి మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలోనే ఆడనుంది. ఇది కూడా భారత అభిమానులను ఆందోళన పరుస్తోంది.