WPL 2025 RCB Vs DC Latest Updates; డబ్ల్యూపీఎల్ లో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రవేశించింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హ్యాట్రిక్ విజయంతో సత్తా చాటింది. అన్నిరంగాల్లో సత్తా చాటిన ఢిల్లీ.. వరుసగా మూడో విజయం సాధించింది. తాజా విజయంతో టోర్నీలో ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
వన్ డౌన్ బ్యాటర్ ఎలీస్ పెర్రీ అద్భుతమైన అర్థ సెంచరీ (47 బంతుల్లో 60 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో శిఖా పాండే, శ్రీ చరణికి రెండేసి వికెట్లు దక్కాయి. టార్గెట్ ను ఢిల్లీ ఉఫ్ మని ఊదేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ (43 బంతుల్లో 80 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో చెలరేగడంతో 9 వికెట్లతో గెలుపొందింది. కేవలం 15.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ కు ఆ వికెట్ దక్కింది. తాజా విజయంతో ఢిల్లీ తన టాప్ ప్లేస్ ను మరింత పటిష్టం చేసుకుంది. శుక్రవారం ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడిన ఢిల్లీ.. శనివారం కూడా ఆర్సీబీతో బరిలోకి దిగింది. అయినా కూడా సత్తా చాటి వరుస విజయాలు సాధించింది. ఇండియా వన్డే మ్యాచ్ ఉండటంతో ఆదివారం డబ్ల్యూపీఎల్ కు సెలవు. సోమవారం జరిగే మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో యూపీ వారియర్జ్ జట్టు తలపడనుంది. ఫెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మంధాన మళ్లీ విఫలం..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఏదీ కలిసి రాలేదు. స్టార్ ఓపెనర్ కమ్ కెప్టెన్ స్మృతి మంధాన (8) వైఫల్యాల బాట వీడటం లేదు. మరోసారి తను త్వరగా ఔటయ్యింది మరో ఓపెనర్ డానీ వ్యాట్ (21) కూడ త్వరగానే వెనుదిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ దశలో రాఘవి బిస్త్ (33)తో కలిసి పెర్రీ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. మూడో వికెట్ కు 66 పరుగులు జోడించడంతో ఆర్సీబీ పుంజుకున్నట్లే కనిపించింది. అయితే కీలకదశలో కట్టుదిట్టంగా ఢిల్లీ బౌలర్లు బంతులు వేయడంతో ఆర్సీబీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిగతా బౌలర్లలో మారిజానే కాప్ కు ఒక వికెట్ దక్కింది.
రికార్డు భాగస్వామ్యం..
ఛేజింగ్ లో ఢిల్లీ అద్భుత రికార్డుతో సత్తా చాటింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (2) త్వరగా ఔటైనా.. షెఫాలీ.. జెస్ జొనాసెన్ (38 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్) ఆఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరు బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ఆర్సీబీకి ఏం చేయాలో తోచలేదు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతుంటే అలా చూస్తుండి పోయారు. ఈ క్రమంలో చెరో 30 బంతుల్లో షెఫాలీ, జొనాసెన్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అలా పార్ట్ నర్ షిప్ కొనసాగిస్తూ చివరకు జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు అబేధ్యంగా146 పరుగులు జోడించారు. ఛేదనలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఆలీసా హీలీ-దేవిక వైద్య.. 2023లో ఆర్సీబీపైనే 139 పరుగుల అజేయ భాగస్వామ్యంతో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఇక ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. తాజా ఓటమితో నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.