David Warner Final Test Match: తన దూకుడైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను అలరించిన ఆస్ట్రేలియా(Austrelia) ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌(Pakistan)తో జరిగిన మూడో టెస్ట్‌తో వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి జట్టును గెలిపించాడు. చివరి టెస్ట్‌ సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన వార్నర్.. చివరి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరి టెస్ట్‌ మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

 

కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్‌ భాయ్‌

విజయంతో తన కెరీర్ ముగిసినందుకు గర్వంగా ఉందని వార్నర్‌ అన్నాడు. కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం అద్భుతంగా ఉందని ఈ స్టార్‌ ఓపెనర్‌ అన్నాడు. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాన్న వార్నర్‌... క్లిష్ట సందర్భాల్లోనూ తనకు అండగా నిలిచిన భార్యకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువేనని భావోద్వేగానికి గురయ్యాడు.  

 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలవడం, యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేయడం, వన్డే ప్రపంచకప్‌ను సాధించడం.. ఇలా అన్ని మెగా ఈవెంట్లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నట్లు వార్నర్‌ తెలిపాడు. రెండేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ అద్భుతంగా ఆడుతోందని తెలిపాడు. ఇలాంటి జట్టుతో ప్రయాణం సాగించడం గర్వంగా ఉందని.... మైదానంలోనే కాకుండా.. వెలుపలా జట్టు సభ్యులు శ్రమించే తీరు అభినందనీయమని చెప్తూ  వార్నర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇవాళ మైదానంలోకి అడుగు పెట్టే ముందు టెస్టుల్లో నా చివరి రోజు అని భావించలేదని. సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్‌ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నాడు. 

 

కుటుంబం పాత్ర కీలకం

తన విజయంలో కుటుంబం పాత్ర చాలా కీలకమని... ప్రతి క్షణం వారితో పంచుకున్నానని వార్నర్‌ తెలిపాడు. తన భార్య కాండిస్ తన విజయంలో కీలకపాత్ర పోషించిందని తెలిపాడు.  దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చానని... తన ఆటతో ప్రతి ఒక్క అభిమాని ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశానని భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ వార్నర్‌ నిష్క్రమించాడు. 

 

వార్నర్‌ టెస్ట్‌ కెరీర్‌ ఇలా..

మొత్తం టెస్ట్ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ ఎల్బీగా అవుటై పెవిలియన్ చేరుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా, పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది.