CWC Qualifiers 2023: బౌలింగ్ లో ఐదు వికెట్లు.. తర్వాత బ్యాట్ తో వీరోచిత శతకం.. వెరసి బాస్ డె లీడె సూపర్ షో తో నెదర్లాండ్స్ జట్టు.. కీలక మ్యాచ్ లో స్కాట్లాండ్ ను ఓడించి ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. లీడ్ సూపర్ షో తో డచ్ టీమ్ అయిదోసారి వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించి స్కాట్లాండ్ కు షాకిచ్చింది. ఇదివరకే ఈ టోర్నీలో శ్రీలంక.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
బ్రాండన్ సెంచరీ..
జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్ లో భాగంగా బులవాయో వేదికగా నిన్న (గురువారం) నెదర్లాండ్స్ - స్కాట్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన డచ్ టీమ్ మొదలు బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ వన్ డౌన్ బ్యాటర్ బ్రాండన్ మెక్ ముల్లెన్ (110 బంతుల్లో 106, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) , కెప్టెన్ బెర్రింగ్టన్ (84 బంతుల్లో 64, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డె లీడె 10 ఓవర్లు బౌలింగ్ చేసి 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..
ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ కు గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ పెంచుకోవడం కీలకమైంది. స్కాట్లాండ్ కంటే కాస్త తక్కువ నెట్ రన్ రేట్ కలిగిన డచ్ టీమ్ కు ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే 44 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అయితే లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 30.5 ఓవర్లలో 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికీ లీడె.. 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు నెదర్లాండ్స్ విజయంపై ఆశలు అడుగంటాయి. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి గెలిచినా అది 13 ఓవర్లలో అయితే అసాధ్యం అనుకున్నారు ఆ జట్టు అభిమానులు. కానీ లీడె అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ డచ్ టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు. 92 బంతులలోనే ఏడు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. ఆరో వికెట్ కు సకిబ్ (33 నాటౌట్) తో కలిసి 11.3 ఓవర్లలోనే 113 పరుగులు జతచేశాడు.విజయానికి రెండు పరుగుల ముందు లీడె నిష్క్రమించినా సకిబ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ విజయంతో నెదర్లాండ్స్ తన రన్ రేట్ ను కూడా పెంచుకుని వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వేలు ఆరు పాయింట్లు సాధించి తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కానీ నెదర్లాండ్స్.. (+0.230) నెట్ రన్ రేట్.. స్కాట్లాండ్ (+0.102), జింబాబ్వే (-0.099) కంటే మెరుగ్గా ఉంది. వన్డే వరల్డ్ కప్ ఆడుతుండటం నెదర్లాండ్స్ కు ఇది అయిదోసారి. గతంలో 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్ లలో కూడా ఆ జట్టు ఆడింది. భారత్ తో కూడా నెదర్లాండ్స్.. నవంబర్ 11న బెంగళూరు వేదికగా మ్యాచ్ ఆడనుంది.