Sachin Security Gurad Suicide in Maharashtra- ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ సెక్యూరిటీగా ఉన్న జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సచిన్ సెక్యూరిటీ కోసం నియమించిన స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్(SRPF) జవాన్‌ ప్రకాశ్‌ కాప్డే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జల్గావ్‌లోని జామ్నేర్‌లో జవాన్ ప్రకాష్ కాప్డే తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు.


ప్రస్తుతం సెలవుపై వెళ్లిన జవాన్ 
ప్రకాష్ కొన్ని రోజులు సెలవు తీసుకుని తన స్వస్థలం జల్గావ్‌లోని జామ్నేర్‌కు వెళ్లినట్లు ఓ అధికారి జామ్నేర్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ షిండే తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత తన ఇంట్లోనే మెడ భాగంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కాల్చుకున్న వెంటనే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీవీఐపీ అయిన సచిన్ కు సెక్యూరిటీ కావడంతో ప్రకాష్ కాప్డే కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 


అయితే వ్యక్తిగత కారణాలతో కాప్డే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు వీవీఐపీ సెక్యూరిటీకి సంబంధించిన గార్డు అయినందున ఎస్ఆర్‌పీఎఫ్‌ స్వతంత్రంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మృతుడు ప్రకాష్ కాప్డేకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రకాష్ 2009 బ్యాచ్ కు చెందిన జవాన్. అతడికి పోస్టింగ్ స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ లో ఇచ్చారు. ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్‌కు రక్షణ కల్పించడం అతని డ్యూటీ. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నారు.