David Warner:  వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే అది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పాడు. వారు కనుక తనను నిష్క్రమించమని చెప్తే అదే చేస్తానని.. 36 ఏళ్ల వార్నర్ చెప్పాడు. 


దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వందో టెస్ట్ ఆడిన డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనితోపాటు కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ లు ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. గత కొన్నాళ్లుగా ఫాంలేమితో వార్నర్ తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో జట్టులో నుంచి తీసేయాలంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ప్రొటీస్ తో మ్యాచులో ఈ విధ్వంసకర ఆటగాడు తన బ్యాట్ తోనే విమర్శకులకు సమాధానం చెప్పాడు. కఠినమైన సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ సాధించాడు. వందో మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 


దేనికైనా నేను సిద్ధం


ఆ మ్యాచ్ అనంతరం విలేకర్ల సమావేశంలో వార్నర్ మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టే తన చివరి బాక్సింగ్ డే టెస్టా అని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు వార్నర్ బదులిచ్చాడు. 'వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు నన్ను నేను ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. పరుగులు చేస్తూనే ఉంటాను. పెద్ద వేదికలపై మంచి ప్రదర్శన చేయాలనే శక్తి నాలో ఎప్పుడూ ఉంటుంది. అయితే టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వారు నన్ను నిష్క్రమించమని చెప్తే అందుకు నేను సిద్ధమే' అని వార్నర్ స్పష్టంచేశాడు. 


ఆసీస్- సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ వివరాలు




మెల్ బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికా పై ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం చేసుకుంది.

 

దక్షిణాఫ్రికా ఓటమి- భారత్ కు లాభం


ఆస్ట్రేలియాతో చేతిలో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి భారత్ కలిసొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో సౌతాఫ్రికా వెనుకబడింది. ఈ భారీ విజయంతో ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. ఇక ఈ ఓటమితో సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో 72 పాయిట్లంతో 54.55 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. బంగ్లాదేశ్ పై విజయంతో టీమిండియా 99 పాయింట్లు సాధించింది. 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.