ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వరుస విజయాలతో భారత్‌ దూసుకుపోతుండడంతో అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చి టీమిండియాకు మద్దుతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడికి ఉచితంగా పాప్‌కార్న్, శీతల పానీయాలు అందించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. నవంబర్‌ రెండున జరిగే శ్రీలంక-భారత్‌ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, నవంబర్ 15న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు కూడా పాప్‌కార్న్‌, శీతల పానియాలు అందిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అమోల్‌ కాలే  తెలిపారు.

 

అభిమానులు తమ టిక్కెట్లను కౌంటర్‌లో చూపించాలని, స్టాంప్‌ వేసిన తర్వాత వారికి ఉచితంగా పాప్‌కార్న్‌, శీతల పానీయం అందజేస్తామని వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చును MCA భరిస్తుందని, కమిటీలోని అపెక్స్ సభ్యులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారని అమోల్ కాలే తెలిపారు. ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే అభిమానులందరికీ ఉచితంగా పాప్‌కార్న్.. శీతల పానీయాలు అందించాలని తాను ప్రతిపాదించానని దానికి ఆమోదం లభించిందని కాలే వెల్లడించారు. ఇలా అందించడం అతిథులను గౌరవించడం అని అమోల్‌ కాలే తెలిపారు. ఇలా ఉచిత పాప్‌కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఇండియా-శ్రీలంక మ్యాచ్‌ నుంచి ప్రారంభమై సెమీస్‌ వరకరు కొనసాగుతుందని వెల్లడించారు. 

 

మరోవైపు నవంబర్‌ రెండున వాంఖడే మైదానంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని నవంబర్‌ 2న ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అమోల్ కాలే ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని నవంబర్ 2 న శ్రీలంకతో టీమిండియా ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సచిన్‌ విగ్రహ ప్రారంభోత్సవ సంబరానికి పలువురు ప్రముఖులు, భారత జట్టు సభ్యులు కూడా హాజరవుతారని ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారని కాలే తెలిపారు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. సచిన్‌తోపాటు సునీల్ గవాస్కర్‌, దిలీప్ వెంగ్‌సర్కార్‌ పేర్ల మీద కూడా వాంఖడేలో స్టాండ్లు ఉన్నాయి.

 

సచిన్‌  భావోద్వేగం

వాంఖడేలో తన విగ్రహం ఏర్పాటు చేయడంపై సచిన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఎంసీఏ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వాంఖడేతో తన అనుబంధం ఇప్పటిది కాదన్న సచిన్‌, తన తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడానని గుర్తు చేసుకున్నాడు. ఆచ్రేకర్‌ సర్, తనను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయానని... ఇక్కడే తన చివరి మ్యాచ్‌నూ ఆడానని గుర్తు చేసుకున్నాడు. వాంఖడేకి వస్తే తన జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుందన్నాడు. తన జీవితంలో అతి పెద్ద ఘటనగా విగ్రహావిష్కరణ నిలిచిపోతుందని సచిన్ అన్నాడు. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి క్రికెట్‌ ధన్యవాదాలు తెలిపాడు.

 

సచిన్ రికార్డులు

సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు.