Champions Trophy IND vs PAK Jio Hotstar live streaming | ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు స్థాయిలో వీక్షించడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో 53 కోట్ల వ్యూయర్‌షిప్ సాధించింది. 33వ ఓవర్ లో 53.3 కోట్లు (533 మిలియన్లు) దాయాదుల పోరును చూశారు. ఇటీవల రిలయన్స్ కు చెందిన జియో సినిమా, డిస్నీకి చెందిన హాట్ స్టార్ విలీనం కావడం తెలిసిందే. దాంతో భారీ స్థాయిలో వ్యూస్ తో జియో హాట్ స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. 34వ ఓవర్లో మ్యాచ్ లైవ్ వ్యూయర్‌షిప్ 54 కోట్లకు చేరింది. ఆ తరువాత 41వ ఓవర్లో ఏకంగా 58.5 కోట్ల వ్యూయర్ షిప్ నమోదైంది.
2017లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వ్యూయర్స్‌ను సైతం అప్పట్లో రికార్డు అయింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ దాదాపు 40 కోట్ల (400 మిలియన్లు) వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఓవరాల్ సిరీస్ లో ఇతర మ్యాచ్ కు అధికంగా 32.4 కోట్ల (324 మిలియన్లు) లైవ్ వ్యూస్ వచ్చాయి.
2011 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఇప్పటివరకూ అధికంగా వ్యూయర్ షిప్ ఉన్న మ్యాచ్ గా ఉండేది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ కు 49.5 కోట్ల (495 మిలియన్లు) వ్యూస్ వచ్చాయి. వాస్తవానికి ఆ మ్యాచ్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యూయర్ షిప్ తో నెంబర్ వన్ గా ఉండేది. తాజాగా దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ 56.5 కోట్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. 2021లో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సైతం 10.3 కోట్ల (103 మిలియన్లు) వ్యూస్ తో టెస్టుల్లో అత్యధిక వ్యూయర్ షిప్ లలో ఒకటిగా నిలిచింది.
విరాట్ కోహ్లీ రికార్డుల జోరు, పాక్ బేజారు..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గ్రూపు-బిలో భాగంగా దుబాయ్ లో జరుగుతన్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్ కు ఆలౌటైంది. ఛేజింగ్ లో భారత బ్యాటర్లు రాణించారు. వేగంగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 20 ఔట్ కాగా, మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (46, 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛేజింగ్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. విరాట్ కోహ్లీ 14వేల వన్డే పరుగుల క్లబ్ లో చేరాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు 158 క్యాచ్ లతో వన్డేల్లో అత్యధిక క్యాచులు పట్టిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అజారుద్దీన్ (156) ను కోహ్లీ అదిగమించాడు.