Australia beat New Zealand Australia won by 3 wickets: న్యూజిలాండ్‌(New Zealand) పర్యటనలో ఆస్ట్రేలియా(Australia) అద్భుతం చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీ తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడి కంగారులకు చిరస్మరణీయ విజయం అందించాడు. క్రిస్ట్‌ చ‌ర్చ్‌లో జ‌రిగిన రెండో టెస్టులో 98 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచి జ‌ట్టును గెలిపించిన మూడో వికెట్‌కీప‌ర్‌గా క్యారీ చ‌రిత్ర సృష్టించాడు. క్యారీ కంటే ముందు గిల్‌క్రిస్ట్, టీమిండియా స్టార్ రిష‌భ్ పంత్ మాత్రమే ఈ ఘ‌న‌త సాధించారు. 



మ్యాచ్‌ సాగిందిలా..
279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆస్ట్రేలియా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో కంగారులు నాలుగో అయిదో వికెట్‌ను కోల్పోయారు. దీంతో ఆసీస్‌ 80 పరుగులకే ఐదో వికెట్‌ కోల్పోయింది. కానీ మార్ష్‌ , క్యారీ ఆరో వికెట్‌కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్‌ ఫలితమే మారిపోయింది. అలెక్స్‌ క్యారీ (98 నాటౌట్‌; 15 ఫోర్లు), మిచెల్‌ మార్ష్‌ (80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అసాధారణంగా పోరాడారు. 220 స్కోరు వద్ద మార్ష్‌ , స్టార్క్‌ నిష్క్రమించినా... ఆసిస్‌ సారధి న్‌ కమిన్స్‌ (32 నాటౌట్‌; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. 2005 నుంచి కివీస్‌ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్‌ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్‌ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది. తొలి టెస్టులో భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆసీస్ రెండో మ్యాచ్‌లోనూ అద్భుతం చేసింది. ఆసీస్‌పై ప‌ది మ్యాచుల్లో తొమ్మిది ఓట‌ముల‌తో కివీస్ చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకుంది. 


కివీస్‌ సారధి అవుట్‌..?
రెండేండ్ల క్రితం కేన్‌ విలియమ్సన్‌ చేతుల నుంచి న్యూజిలాండ్‌ టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన టిమ్‌ సౌథీ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులలో ఓడి సిరీస్‌ను 0-2తో ఆస్ట్రేలియాకు అప్పగించిన తర్వాత అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిపై సౌథీ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ అతడు కెప్టెన్‌గా తన చివరి టెస్టు ఆడేశాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 2022 డిసెంబర్‌లో కేన్‌ మామ టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను సౌథీకి అప్పజెప్పాడు. ఈ రెండేండ్ల కాలంలో 12 టెస్టులలో సారథిగా ఉన్న సౌథీ.. పాకిస్తాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌ను గెలవగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ కూడా డ్రా అయింది. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకున్న కివీస్‌.. ఆసీస్‌తో మాత్రం వైట్‌ వాష్‌ అయింది.