Who Has Better Statistics In Test Cricket: ఇంగ్లండ్‌(England) స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌(Joe Root) శతకాల మోత మోగిస్తుండడంతో... సచిన్‌(Sachin) రికార్డును అధిగమించేది ఎవరు అనే దానిపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అత్యధిక టెస్ట్‌ సెంచరీలు సాధించిన టాప్ 5 యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో జో రూట్ దూసుకుపోతున్నాడు. బజ్‌బాల్‌ ఆటతో రూట్ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. 


శ్రీలంక(Srilanka)తో జరుగుతున్న టెస్ట్‌లో సెంచరీ చేసి.. రూట్ టెస్టుల్లో 33 శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో అలెస్టర్ కుక్‌తో కలిసి అగ్రస్థానంలో రూట్‌ కొనసాగుతున్నాడు. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ టాప్ 10లోకి ప్రవేశించాడు. సచిన్ టెండూల్కర్ 51 టెస్టు సెంచరీల కంటే రూట్‌ 18 శతకాలు వెనుకబడి ఉన్నాడు. సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును రూట్ బద్దలు కొడతాడని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..

 

1. జో రూట్ 

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్ ఇప్పటికే 33 శతకాలు చేశాడు. గత నాలుగేళ్లుగా రూట్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. 2021 సీజన్‌లో కేవలం 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్‌... తర్వాత నాలుగేళ్లలో 16 సెంచరీలు చేశాడు. ప్రస్తుత టెస్ట్ ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా రూట్‌ ఉన్నాడు. సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం రూట్‌కే ఎక్కువ ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. 2013లో న్యూజిలాండ్‌పై తొలి సెంచరీ చేసిన రూట్‌... ఆ తర్వాత బ్రిటీష్‌ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. టెస్టుల్లో రూట్‌ బెస్ట్‌ పాకిస్థాన్‌పై 254 పరుగులు. 

 

2. కేన్ విలియమ్సన్ (Kane Williamson)

  న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్‌ 32 శతకాలతో రెండో స్తానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ 32 టెస్టు సెంచరీలతో జో రూట్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది విలియమ్సన్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు చేసి రికార్టు సృష్టించాడు. కేన్‌ అత్యుత్తమం విండీస్‌పై సాధించిన 251 పరుగులు. విలియమ్సన్‌ కెరీర్‌లో మొదటి సెంచరీ 2010లో భారత్‌పై వచ్చింది. 

 

3. స్టీవ్ స్మిత్ (Steve Smith)

ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ జాబితాలో  32 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. బెస్ట్‌ టెస్ట్ రన్ స్కోరర్‌గా క్రికెట్‌ ప్రపంచం భావిస్తున్న స్మిత్‌.. జో రూట్‌కు గట్టి పోటీదారు. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ సగటు ఉన్న క్రికెటర్‌ స్మిత్‌. స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌ నైపుణ్యం అతడిని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో నిలిపింది. ఇటీవల స్మిత్‌ నెమ్మదించినా.. ఫామ్‌ అందుకుంటే స్మిత్‌ను ఆపడం కష్టం.

 

4. విరాట్ కోహ్లీ (VIRAT KOHLI)

  టీమిండియా కింగ్‌ కోహ్లీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 29 సెంచరీలతో ఉన్నాడు. ఇటీవలి సంవత్సరాల్లో కోహ్లీ పెద్దగా రాణించడం లేదు. కానీ ఒక్కసారి ఫామ్‌ను అందిపుచ్చుకుంటే కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు. 2020 నుంచి కోహ్లీకి కేవలం 2 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ 2023 నుంచి కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ తొలి సెంచరీ అడిలైడ్ ఓవల్‌లో వచ్చింది. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక పరుగులు దక్షిణాఫ్రికాపై 254 నాటౌట్‌. 

 

5. చెతేశ్వర్ పుజారా(Chateswar Pujara)

యాక్టీవ్‌ ప్లేయర్లలో పుజారా 19 శతకాలతో అయిదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ వార్నర్‌ 26 సెంచరీలతో ఈ స్థానంలో ఉండేవాడు. వార్నర్‌ రిటైర్‌మెంట్‌తో పుజారా ఈ స్థానాన్ని ఆక్రమించాడు. పుజారా టెస్టుల్లో మంచి ఆటగాడే. అయితే ఈ మధ్య పుజారాకు సరైన అవకాశాలు దక్కడం లేదు. ఈ దశలో పుజారాపై భారీ ఆశలు అయితే లేవు.