Indonesia vs Cambodia T20I Series: మనం గల్లీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు అవుట్‌ కాకపోయినా అంపైర్‌ అవుటిస్తే ఏం చేస్తాం. మనసులో తిట్టుకుంటాం. లేదా అంపైర్‌తో వాగ్వాదం చేస్తాం. అవసరమైతే  గొడవకు దిగుతాం. ఇంకా కోపమొస్తే మ్యాచ్‌ అంతటితో ఆపేసి వెనుదిరుగుతాం. ఈ తొండి ఆట మేం ఆడం పో  అని తేల్చి పారేస్తాం. ఇలాంటి ఘటనలు సాధారణంగా గల్లీ క్రికెట్‌లో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ అచ్చం ఇలాంటి ఘటనే అంతర్జాతీయ స్థాయిలో జరిగితే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ అచ్చం అలాగే జరిగింది. తమ జట్టు ఆటగాడిని అన్యాయంగా అవుట్‌ ఇచ్చారని ఓ జట్టు మ్యాచ్‌ ఆడకుండా మధ్యలోనే వెళ్లిపోయింది. ఇదీ గల్లీ క్రికెట్‌ అయితే పెద్ద విషయం కాకపోయినా.. ఇది జరిగింది అక్షరాల అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అందుకే ఈ వార్త వైరల్‌గా మారి సోషల్‌ మీడియాను దున్నేస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... 


జెంటిల్మెన్ గేమ్‌ అయిన క్రికెట్‌లో బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించారని టీమ్ మ్యాచ్ ఆడటం ఆపేయడం సంచలనంగా మారింది. గల్లీ క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటన జరగడమేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అరుదైన  ఘటన కంబోడియా-ఇండోనేషియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జరిగింది. తమ జట్టులోని బ్యాటర్‌ను అన్యాయంగా ఔట్‌ ఇచ్చారని ఆరోపిస్తూ కంబోడియా మ్యాచ్‌ మధ్యలోనే వాకౌట్‌ చేసింది. 


బాలి వేదికగా కంబోడియ – ఇండోనేషియా మధ్య ఆరో టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండోనేషియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కంబోడియా తొలుత బ్యాటింగ్ చేపట్టింది. బ్యాటింగ్‌కు వచ్చిన కంబోడియా.. 11.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. అయితే దానేశ్‌ శెట్టి వేసిన ఆ ఓవర్‌ మూడో బంతికి కంబోడియా బ్యాటర్‌ లుక్మన్‌ బట్‌.. వికెట్‌ కీపర్‌ ధర్మ కెసుమాకు క్యాచ్‌ ఇచ్చాడు. అంపైర్‌ దీనిని ఔట్‌గా ప్రకటించాడు. కానీ కంబోడియా మాత్రం అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కానీ అంపైర్లు మాత్రం దానిని ఔట్‌గానే ప్రకటించారు. ఈ ఔట్ అంశం వివాదాస్పదం కావటంతో కంబోడియా మ్యాచ్ కొనసాగించేందుకు అంగీకరించలేదని తెలిసింది. అంపైర్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో చివరకు చేసేదేమీ లేక అంపైర్లు ఇండోనేషియాను విజేతగా ప్రకటించారు. ఈ ఘటనపై అధికారికంగా ఏ జట్టూ స్పందించలేదు. 


ఈ మ్యాచ్‌ ఇలా ఆగిపోవడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సాధారణంగా వర్షం పడి క్రికెట్ మ్యాచ్‌కు అంతరాయం కలగడం చూస్తుంటామని.. కానీ తొలిసారి అంపైర్‌ నిర్ణయం వల్ల ఆగిపోయిందని సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయించడం చూశామని.. కానీ ఇది మరో పద్ధతంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. మాములుగా చిన్నజట్లు ఆడే మ్యాచ్‍ల గురించి క్రికెట్ ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. కానీ ఈ ఘటనతో ఇండోనేషియా, కంబోడియా మ్యాచ్ కూడా వార్తల్లో నిలిచింది. ఏది ఏమైనా ఇప్పుడు కంబోడియా టీమ్‌ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచింది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply