Brian Lara On Kohli:  మంగళవారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అర్ధశతకాలతో రాణించటంతో లంక ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం బౌలర్లు సమష్టిగా చెలరేగటంతో భారత్ 67 పరుగుల తేడాతో గెలిచింది. 


ఈ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత శతకం సాధించాడు. 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అద్భుత షాట్లతో అలరించిన విరాట్ కు 2 జీవనదానాలు లభించాయి. అయితే ఆ రెండు మినహా కోహ్లీ చూడచక్కని బ్యాటింగ్ చేశాడు. 80 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కోహ్లీ అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది. బంగ్లాదేశ్ లో చివరి వన్డేలో సెంచరీ తర్వాత విరాట్ వరుసగా రెండో శతకం సాధించాడు. 


నేనూ ఎదురుచూస్తున్నాను


కోహ్లీ బ్యాటింగ్ చూడడం కోసం అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ కు దిగేముందు విరాట్ కోహ్లీ డగౌట్ లో కూర్చున్న ఫొటోను లారా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. దానికి 'అతని బ్యాటింగ్ చూడడానికి నేను ఎదురుచూస్తున్నాను అనుకుంటున్నాను' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత సెంచరీ చేసిన కోహ్లీని అభినందిస్తూ లారా మరో పోస్ట్ పెట్టాడు. 


సిరీస్ లో 1-0 ఆధిక్యం


భారత్ తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కోహ్లీ, రోహిత్, గిల్ ల మెరుపు బ్యాటింగ్ తో భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ (3/57), మహ్మద్ సిరాజ్ (2/30) లు కలిసి 5 వికెట్లు తీశారు. దీంతో భారత్ శ్రీలంకను 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితం చేసింది. శ్రీలంక తరఫున కెప్టెన్ దసున్ షనక (108 నాటౌట్) టాప్ స్కోరర్.  పాతుమ్ నిస్సాంక 72 పరుగులు చేశాడు.