IND vs AUS 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సమయం వచ్చేసింది. మరొక్క రోజులో భారత్- ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు (ఫిబ్రవరి 9) నాగ్ పుర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఆసీస్ ఆటగాళ్ల కవ్వింపు మాటలు, భారత ప్లేయర్ల కౌంటర్లు, మాజీల విశ్లేషణలు, క్రికెట్ పండితుల అభిప్రాయాలతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
భారత్ కు మ్యాచ్ కంటే ముందే ఒక పెద్ద తలనొప్పి ఉంది. అదే తుది జట్టు కూర్పు. చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండడం, కొందరి ఫాం, జట్టు సమతుల్యం వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తుది జట్టును ఎంపిక చేయడం కోచ్, కెప్టెన్ కు కత్తిమీద సాములా మారింది. తొలి మ్యాచ్ లో తుది జట్టు ఎలా ఉంటుందో తెలియదు కానీ.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం తన తుది జట్టును ప్రకటించారు. ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. తన ప్లేయింగ్ ఎలెవన్ గురించి తెలిపాడు. అలాగే ఈ సిరీస్ ను భారత్ 4-0 తో గెలుచుకుంటుందని అన్నాడు.
భారత్ 4-0తో గెలవాలి
2017లో భారత్ 2-1తో ఆసీస్ తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. దాని తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత్ లో టెస్టుల కోసం రావడం ఇదే తొలిసారి. ఈ మధ్య భారత్ రెండు బోర్డర్- గావస్కర్ (2018-19, 2020-21) ట్రోఫీలను గెలుచుకుంది. ఇవి రెండూ ఆస్ట్రేలియా వేదికగా జరిగాయి. ఈ క్రమంలోనే ఈసారి భారత్ సిరీస్ గెలవాలని రవిశాస్త్రి అన్నాడు. అది కూడా 4-0 తో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయాలని అభిప్రాయపడ్డాడు.
'టీమిండియా 4-0తో గెలవాలి. మేం స్వదేశంలో ఆడుతున్నాం. నేను 2 ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లాను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. నేను కోచ్ గా ఉంటే ఆసీస్ ను వైట్ వాష్ చేయాలనే ఆలోచనతోనే ఉంటాను. ఎవరైనా నన్ను ఏ విధమైన పిచ్ కావాలని అడిగితే.. కచ్చితంగా స్పిన్ పిచ్ కావాలనే చెప్తాను. అదికూడా మొదటిరోజు నుంచే బంతి తిరిగేలా. నాకు అదే కావాలి.' అని రవిశాస్త్రి అన్నారు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రవిశాస్త్రి ప్రకటించిన తుది జట్టు
- రోహిత్ శర్మ(కెప్టెన్),
- శుభ్ మన్ గిల్ (లేదా) కేఎల్ రాహుల్
- ఛతేశ్వర్ పుజారా
- విరాట్ కోహ్లీ
- సూర్యకుమార్ యాదవ్
- కేఎస్ భరత్ (లేదా) ఇషాన్ కిషన్
- కుల్దీప్ యాదవ్
- రవిచంద్రన్ అశ్విన్
- రవీంద్ర జడేజా
- మహమ్మద్ సిరాజ్
- మహమ్మద్ షమీ
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆరు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో ఒకటి భారత్, ఆస్ట్రేలియా మధ్య కూడా జరిగింది. 14 ఏళ్ల క్రితం 2008 నవంబర్‌లో ఈ మైదానంలో ఇరు జట్లు తలపడ్డాయి.