భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయపడటం జాతీయ జట్టుకు పెద్ద దెబ్బ. ఇది అభిమానులను కూడా ఆందోళన పరిచే అంశమే. బుమ్రా గాయం కారణంగా ఇప్పటికే ఆసియా కప్ నుండి వైదొలిగాడు. ఇప్పుడు అతను టీ20 ప్రపంచ కప్ 2022లో కూడా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఇన్‌సైడ్‌స్పోర్ట్ కథనం ప్రకారం... ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రీహాబ్‌లో ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ 2022లో పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది. 2019లో ఇదే వెన్ను గాయం అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. జస్‌ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా లోని ప్రీమియర్ పేస్ బౌలర్. ఈ గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగిలే, అది జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది.


జస్‌ప్రీత్ బుమ్రా గాయం గురించి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కి అప్‌డేట్ ఇస్తూ, బీసీసీఐ అధికారి ఒకరు, "అవును, ఇప్పుడు బుమ్రా గాయంపైనే దృష్టి పెట్టాం. అతను తిరిగి రీహాబ్‌లోకి వచ్చాడు. అందుబాటులో ఉన్న ఉత్తమ వైద్య సలహాలను అందుకుంటాడు. అతని పాత గాయం మరింత సమస్యగా మారింది. ప్రపంచ కప్‌కు మాకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది.అతనికి అత్యంత కీలకమైన సమయంలో ఈ గాయం తిరగబెట్టింది. మేము అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. అతను క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ కాబట్టి జాగ్రత్త  తీసుకోవాల్సిన అవసరం ఉంది."


జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో, ఆసియా కప్‌లో భారత బౌలింగ్ లైనప్ బలహీనపడింది. జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ లేడు. అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా ఫామ్‌లో ఉన్న స్పీడ్‌స్టర్ హర్షల్ పటేల్ కూడా ఆసియా కప్ జట్టులో ఎంపిక కాలేదు.


ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు బీసీసీఐ ఇటీవలే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంతకాలం బ్రేక్ తీసుకుని ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. ఈ సంవత్సరం జూన్‌లో విరాట్ కోహ్లీ చివరిగా మైదానంలోకి దిగాడు. ఆసియా కప్‌లో టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నారు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు యూఏఈలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లు జట్టుకు స్టాండ్ బైగా ఉన్నారు. మొత్తం ఆరు జట్లు 2022 ఆసియా కప్‌లో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీకి నేరుగా ఎంపికయ్యాయి. పాల్గొనబోయే మరో జట్టును క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇటీవలే భారత్, వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది.


ఆసియా కప్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్