Bhuvneshwar Kumar: టీమిండియా  వెటరన్ పేసర్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు  రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా..?  జాతీయ జట్టులో అవకాశాలు  తగ్గడంతో భువీ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి తప్పుకుందామనే ఫిక్స్ అయ్యాడా..?  ఇంటర్నెట్‌లో ఇదే అంశం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.  భువనేశ్వర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చడమే దీనికి ప్రధాన కారణం.. 


భువీ  ఇన్‌స్టా ఖాతాలో ‘ఇండియన్ క్రికెటర్’ అని ఉండేది. కానీ   అతడు తాజాగా ‘క్రికెటర్’ అన్న పదాన్ని తొలగించి కేవలం ‘ఇండియన్’ను మాత్రమే ఉంచాడు.  దీంతో అభిమానుల్లో  భువీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడన్న ఆందోళనలు మొదలయ్యాయి. భువీ  బయోను ఎడిట్ చేయకముందు, చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ వైరల్ అవడంతో  సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలైంది.  


33 ఏండ్ల భువీ.. భారత జట్టు తరఫున చివరిసారి  2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆడాడు.  ఆ తర్వాత  ఆలిండియా సెలక్షన్ కమిటీ  సీనియర్లు   రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టిన విషయం తెలిసిందే.  ఈ జాబితాలో  భువీ కూడా ఉన్నాడు. టెస్టులు, వన్డేలలో  సెలక్టర్లు భువీని ఎప్పుడో పక్కనబెట్టిన విషయం తెలిసిందే. టీ20లలో  కూడా  అతడిని  జాతీయ జట్టులోకి తీసుకోవడం కష్టమే అని తేలడంతో  ఇక అతడు  అంతర్జాతీయ స్థాయి నుంచి తప్పుకోవడమే బెటర్ అన్న  వాదనలు వినిపించాయి. అదీగాక టీ20లలో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి వంటి యువ బౌలర్లకు అవకాశాలు ఇచ్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. 


 






 






2012 నుంచి భారత జట్టుకు ఆడుతున్న భువీ..  టెస్టులు, వన్డేలు, టీ20లలో  ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.  అంతేగాక అరంగేట్ర మ్యాచ్ (వన్డే, టీ20)లలో  వేసిన తొలి బంతికి వికెట్ తీసిన బౌలర్ కూడా అతడే.   భారత్ తరఫున  21 టెస్టులు ఆడిన భువీ..  63 వికెట్లు పడగొట్టాడు. 121 వన్డేలు ఆడి  141 వికెట్లు తీశాడు.   77 టీ20 మ్యాచ్‌లలో  84 వికెట్లు సాధించాడు.   టీ20లలో   భువీ  అత్యుత్తమ ప్రదర్శన 5-4గా ఉండటం గమనార్హం.  2018లోనే టెస్టుల నుంచి అనధికారికంగా తప్పుకున్న భువీ ఎక్కువగా  పరిమిత ఓవర్ల క్రికెట్‌కే అధిక ప్రాధాన్యతనిచ్చాడు.   2022లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లగా   ఆ టూర్‌లో చివరిసారి వన్డేలు ఆడాడు.  ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో భువీ.. రింకూ సింగ్‌తో కలిసి దిగిన ఫోటో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా ఇన్‌స్టా బయో తొలగించిన భువీ.. ట్విటర్‌లో మాత్రం  ఇంకా ‘ఇండియన్ క్రికెటర్’ అన్న బయోను మాత్రం ఎడిట్ చేయలేదు.










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial