BCCI Age Verification: క్రికెట్ లాంటి ఫేమ్ గేమ్‌లో వయసు సంబంధించి ఆరోపణలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. పలుమార్లు పాక్ ప్లేయర్స్ షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ ఏజ్ మీద విమర్శలు రావడం తెలిపిందే. వారు వయసును తక్కువగా చూపించారని సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీద సైతం ఏజ్ రిలేటెడ్ ఆరోపణలు వచ్చాయి. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అన్ని టెస్టులు చేసి వెరిఫై చేశాకే ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల వయస్సు మోసాన్ని నిరోధించడానికి వయస్సు ధృవీకరణ ప్రోగ్రాం (AVP) లో మార్పులు చేసింది. ఈ ఏడాది నుంచి BCCI 'ఎముక వయస్సు' (Bone Test) నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉన్న ఆటగాళ్లకు రెండోసారి బోన్ టెస్ట్ చేసేలా నిబంధనలు సవరించింది.
చీటింగ్‌కు ఛాన్స్ లేదంటున్న బీసీసీఐ
BCCI ఇప్పటివరకు 14-16 సంవత్సరాల వయస్సు గల బాలురకు ఎముక పరీక్షలు (Bone Tests) నిర్వహిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆటగాడి 'ఎముక వయస్సు' వెల్లడైన తర్వాత, అందులో ఒక సంవత్సరం కలుపుతారు. ఈ పెరిగిన వయస్సు ఆధారంగానే ఆ ఆటగాడిని సంబంధిత ఏజ్ రిలేటెడ్ క్రికెట్ టోర్నమెంట్లలో ఆడేందుకు అనుమతిస్తారు. ఉదాహరణకు, ఒక ఆటగాడి 'ఎముక వయస్సు' 14.8 అయితే, దానిని 15.8 ఏళ్లకు పెంచుతారు. ఈ 'ఎముక వయస్సు' (Bone Age) ప్రకారం, ఆ ప్లేయర్ అండర్-16 క్రికెట్‌లో తదుపరి సీజన్ ఆడటానికి అర్హత సాధిస్తాడని తెలిసిందే.
రూల్స్ సవరించిన బీసీసీఐ
వయసు ధృవీకరణ ప్రోగ్రాం (AVP) ప్రకారం, ఒక ఆటగాడు తన డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటే, అతను రెండవ 'ఎముక పరీక్ష' చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టుల తర్వాత కూడా అతని వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువగా తేలితే, అతనికి తదుపరి సీజన్ ఆడటానికి అనుమతిస్తారు. అదేవిధంగా, 12-15 వయస్సు గల బాలికలకు కూడా ఇదే ప్రక్రియను అమలు చేయనున్నారు.
బోన్ టెస్ట్ ఫలితాలను 100 శాతం ఖచ్చితమైనవిగా పరిగణించలేము అని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కనుక రెండవ పరీక్ష నిర్వహించడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో జరిగిన BCCI సమావేశంలో రెండవ బోన్ టెస్ట్ నిర్వహించే నిబంధనకు ఆమోదం లభించింది. ఈ పరీక్ష ఎక్స్-రే ద్వారా నిర్వహించనున్నారు. ప్రతి డొమోస్టిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ళు ఈ పరీక్షకు హాజరు కావాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
కాగా, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని మరీ 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్ పై సాధించిన సమయంలో అతడి ఏజ్ విషయంలో విమర్శలు వచ్చాయి.