IND vs Eng 1st Test Highlights: భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌లుగా తమ తొలి టెస్టులో సెంచరీలు సాధించిన ఘనతను అతి కొద్ది మందే అందుకున్నారు. అందులో విదేశీ పర్యటనలో కెప్టెన్‌లుగా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు చేసింది మాత్రం ఇద్దరే ఇద్దరు. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ఐదు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు విదేశాల్లో తన తొలి సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో 140 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి టెస్టుల్లో విదేశాల్లో తొలి సెంచరీ చేశాడు. అంతే కాదు, కెప్టెన్‌గా తొలి విదేశీ పర్యటనలో, తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కింగ్ కోహ్లీ తొలి భారతీయ కెప్టెన్ కాగా, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే...

విదేశీ పర్యటనలో కెప్టెన్‌గా తొలి టెస్ట్ సెంచరీ రికార్డు కింగ్ కోహ్లీదే...

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో కింగ్ కోహ్లీది ఓ ప్రత్యేక స్థానం. కెప్టెన్‌గా ఎంపికైన వెంటనే విదేశీ పర్యటనలో కెప్టెన్‌గా తొలి టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ కెప్టెన్‌లలో కింగ్ కోహ్లీనే తొలి వ్యక్తి. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. దీంతో జట్టు పగ్గాలను కోహ్లీ స్వీకరించాల్సి వచ్చింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ అది. ఇది విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా తొలి అంతర్జాతీయ పర్యటన. అంతే కాదు, తొలి టెస్ట్ మ్యాచ్ కూడా. ఈ అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయాడు. 141 పరుగులు సాధించి కెప్టెన్‌గా తొలి విదేశీ పర్యటనలో, అది తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఏకైక భారతీయ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. అంతకు మునుపు ఏ భారతీయ కెప్టెన్ ఈ ఘనతను అందుకోలేకపోయారు. అది కూడా ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించడం విశేషం.

కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారతీయ కెప్టెన్లు వీరే..

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా విదేశీ పర్యటనలో అరంగేట్రం చేసి రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సాధిస్తే, స్వదేశంలో కెప్టెన్‌గా తమ తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన భారతీయ కెప్టెన్లు ఇద్దరు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కూడా తమ కెప్టెన్‌గా తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించింది మాత్రం భారతీయ గడ్డపైనే.

1951లో ఇంగ్లాండ్‌పై విజయ్ హజారే

1951లో భారత్‌లో ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్‌కు నూతన కెప్టెన్‌గా విజయ్ హజారే ఎంపికయ్యారు. ఆయన సారథ్యంలో భారత్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇంగ్లాండ్‌ను ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో విజయ్ హజారే కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించారు. ఈ మ్యాచ్‌లో 164 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సిరీస్ కూడా డ్రా కావడం విశేషం.

1976లో న్యూజిలాండ్‌పై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మ్యాచ్ ముంబైలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన తొలి మ్యాచ్‌లోనే 116 పరుగులు చేయడం విశేషం. 162 పరుగులతో న్యూజిలాండ్‌ను ఇండియా ఓడించింది. ఇది కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్‌కు చక్కటి ఆరంభం అని చెప్పాలి. ఆ తర్వాత ఈ మూడు టెస్టుల సిరీస్‌ను ఇండియా 2-0తో గెలుచుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే ఇలా కెప్టెన్‌లుగా తమ తొలి పర్యటనలో, అది తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారతీయులు కింగ్ కోహ్లీ, శుభమన్ గిల్, విజయ్ హజారే, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రమే. అయితే కింగ్ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా విదేశీ గడ్డపై కెప్టెన్‌గా అరంగేట్రం చేసి, పటిష్టమైన ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఏకైక భారతీయ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా  శుభమన్ గిల్ ఆ రికార్డు సాధించిన రెండో వ్యక్తిగా  చరిత్ర సృష్టించారు. విదేశీ పర్యటనలో, అది కూడా కెప్టెన్‌గా తొలి పర్యటనలో మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన భారతీయ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ మాత్రమే. అయితె రెండు ఇన్సింగ్స్ లలో సెంచరీ చేసింది మాత్రం విరాట్ కోహ్లీ మాత్రమే.  ఇది అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఒక వేళ హెడింగ్లేలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కూడా  శుభమన్ గిల్ సెంచరీ చేస్తే కోహ్లీ రికార్డును సమం చేసే అవకాశం ఉంది.