BCCI Review Meeting: టీమ్‌ఇండియా వరుస వైఫల్యాలు బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేశాయి. ఆస్ట్రేలియాలో టీ20 సెమీస్‌లో ఘోరంగా విఫలమవ్వడం, ఇప్పుడు బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు వన్డే సిరీసులు ఓడిపోవడం అంతర్జాతీయ క్రికెట్లో అవమానకరంగా మారింది. దాంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బోర్డు భావిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి రాగానే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో సమీక్ష నిర్వహించనుందని తెలిసింది.


వాస్తవంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో ఓడిపోయినప్పుడు బీసీసీఐ సమీక్ష నిర్వహించాలని భావించింది. అధికారులంతా బిజీగా ఉండటం, కుర్రాళ్ల జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లడంతో కుదర్లేదు. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా రెండు వన్డేలు ఓడిపోవడం బోర్డులో కాక రేపింది. అభిమానులైతే ఏకంగా తిట్టుకోవడం మొదలు పెట్టారు. మరో ఏడాదిలోనే వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.


టీమ్‌ఇండియా చివరి సారిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. 2011లో ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ ట్రోఫీ తీసుకురాలేదు. 'బంగ్లాదేశ్ పర్యటనకు ముందు మేం భారత జట్టుతో సమావేశం కాలేకపోయాం. ఎందుకంటే అప్పట్లో ఆఫీస్‌ బేరర్స్‌ బిజీగా ఉన్నారు. ఢాకా నుంచి టీమ్‌ఇండియా తిరిగి రాగానే సాధ్యమైనంత త్వరగా సమావేశాన్ని షెడ్యూలు చేస్తాం. బంగ్లా చేతిలో ఓటమి పాలవుతారని మేం అస్సలు ఊహించలేదు. ఇది అవమానకర ప్రదర్శనే' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. టీ20 క్రికెట్లో ఇంకెన్నాళ్లు కొనసాగుతాడో తెలియదు. అతడు వరుసగా గాయాల పాలవుతుండటం, ఫిట్‌ నెస్‌ సమస్యలు ఎదుర్కోవడం ఇబ్బందిగా మారింది. 2023లో భారత్‌లోనే వన్డే ప్రపంచకప్‌ జరుగుతుంది. ఆ మెగా టోర్నీకి హిట్‌మ్యాన్‌ను తాజాగా ఉంచాలని బోర్డు భావిస్తోంది. 2024లో వెస్టిండీస్‌, అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అప్పటికి హార్దిక్‌ పాండ్యను పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా రూపొందించాలని బీసీసీఐ ఆలోచనగా ఉంది. సమీక్షలో కెప్టెన్సీ మార్పుపై నిర్ణయాలు తీసుకొంటారని సమాచారం.


Also Read: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'


Also Read: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!