అజిత్‌ అగార్కర్‌(Ajit Agarkar) సారథ్యంలోని భారత పురుషుల సెలక్షన్‌ కమిటీ(national selector for the senior men's team)లో ఒక సెలక్టర్‌ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ(BCCI) దరఖాస్తులను ఆహ్వానించింది. దానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది. గత ఏడాది జులైలో చేతన్ శర్మ స్థానంలో అజిత్ అగార్కర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీలో ఐదుగురు సభ్యులున్నారు. అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న మెన్స్‌ సెలక్షన్‌ కమిషన్‌ లో శివ సుందర్‌ దాస్ (ఈస్ట్‌ జోన్‌)‌, సుబ్రతో బెనర్జీ (సెంట్రల్‌ జోన్‌), సలిల్‌ అంకోలా (వెస్ట్‌ జోన్‌), శ్రీధరన్‌ శ్రీరామ్‌ (సౌత్‌ జోన్‌) లు సభ్యులుగా ఉన్నారు. అజిత్ అగార్కర్‌ కూడా వెస్ట్ జోన్‌ నుంచే సభ్యుడిగా ఉన్నాడు. ఒక జోన్‌ నుంచి ఒక్క సెలక్టర్‌ మాత్రమే ఉండాలనే నిబంధన బీసీసీఐ రాజ్యాంగంలో ఉంది. దీంతో సలీల్‌ అంకోలాను తప్పించి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని నార్త్ జోన్‌ నుంచి ఒకరిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.  సెలక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి.. భారత్‌ తరఫున కనీసం ఏడు టెస్టులు ఆడి ఉండాలి. లేదంటే దేశవాళీలో 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.

 

అర్హతలు ఏంటంటే

కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి కావాలి.

5 ఏళ్ల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. ఇలాంటి వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు.

 

టీ 20 ప్రపంచకప్‌ పరీక్ష

టీమిండియా సెలక్షన్‌ కమిటీకి ఇప్పుడు టీ 20 ప్రపంచకప్‌ పరీక్ష ఎదురుకానుంది. ఈ ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. రోహిత్‌, కోహ్లీలను జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ ఇప్పటికే వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

ఒక్క కాలితో ఆడినా తీసుకోవచ్చు

టీమిండియా ఫినిషర్‌ రిషబ్‌ పంత్‌( Rishabh Pant) ఒక కాలితో ఆడేంత ఫిట్‌గా ఉన్నా అతడిని జట్టులోకి తీసుకోవచ్చని గావస్కర్‌(Sunil Gavaskar) అన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పంత్‌ సొంతమని కితాబిచ్చాడు. పంత్‌ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్‌ ఏదైనా పంత్‌ గేమ్‌ ఛేంజర్‌ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు.