BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)  తాజాగా   టీమిండియా క్రికెటర్లకు 2023కు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది.  సుదీర్ఘకాలంగా టీమిండియా తరఫున ఆడుతున్న  స్టార్ ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా  ‘A’ నుంచి  ‘A+’ కేటగిరీకి ప్రమోట్ అయ్యాడు.  జడేజాకు ప్రమోషన్ దక్కగా గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో  విఫలమవుతున్న కెఎల్ రాహుల్ ను డిమోట్ చేసింది.   రాహుల్  'A' కేటగిరీ నుంచి 'B'కి పడిపోయాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ,  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేస్ గుర్రం  జస్ప్రీత్ బుమ్రాలు  ‘ఎ ప్లస్’ గ్రేడ్ లోనే కొనసాగుతున్నారు.


జడ్డూకు  ‘ఎ+’ కేటగిరీ ఇచ్చిన  బీసీసీఐ..  టీమిండియా టీ20 లకు  సారథిగా వ్యవహరిస్తున్న  హార్ధిక్ పాండ్యా,  అక్షర్ పటేల్ లు   కూడా ‘ఎ’ గ్రేడ్  దక్కించుకున్నారు. వీళ్లే గాక రిషభ్ పంత్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ కూడా  ‘ఎ’  కేటగిరీలోనే ఉన్నారు.  వాస్తవానికి  జడేజాకు ‘ఎ ప్లస్’ కాంట్రాక్టు ఇవ్వాలని  గత రెండేండ్లుగా అనుకుంటున్న గాయాల కారణంగా అతడు తరుచూ జట్టుకు దూరమవడంతో బీసీసీఐ కూడా అంతగా పట్టించుకోలేదు.  కానీ వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో  ఈ  ట్రోఫీలో  జడ్డూ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున  గ్రేడ్ పెరిగింది. 


ఇక గాయంతో చాలాకాలం క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా లతో పాటు  రిషభ్ పంత్ లు తమ కాంట్రాక్టులను నిలుపుకున్నారు. మొత్తంగా గ్రేడ్ ఎ ప్లస్ లో  నలుగురు క్రికెటర్లు ఉండగా..  ‘ఎ’లో  ఐదుగురు ఉన్నారు.  గ్రేడ్ ‘బి’లో  ఆరుగురు ఉండగా  ‘సి’లో  11 మంది ఉన్నారు. కాగా ఈసారి గ్రేడ్ ‘సి’లో ఉన్న శాంసన్.. ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత  సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని బ్యాకప్ ప్లేయర్లుగా ఉన్నవారికే కాంట్రాక్టులు దక్కాయి.  దీపక్ చహర్, ఉమ్రాన్ మాలిక్ వంటి  వర్ధమాన ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. 


సెంట్రల్ కాంట్రాక్టుల  పూర్తి వివరాలు : 


Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా


Grade A: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్,  రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్


Grade B: ఛతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్  


Grade C: శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా,  యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కెఎస్ భరత్ 


- గ్రేడ్ ఎ ప్లస్ కేటగిరీ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు 
- గ్రేడ్ ఎ కేటగిరీకి రూ. 5 కోట్లు 
- గ్రేడ్ బి కేటగిరీ  రూ. 3 కోట్లు 
- గ్రేడ్ సి  కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయలు దక్కుతాయి.