Rohit Sharma - Rahul Dravid: టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడా? కోచ్ గా రాహుల్ ద్రవిడ్ భవితవ్యం ఏమిటి? వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ముంబయిలో జరిగే ముఖ్యమైన సమావేశానికి బీసీసీఐ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు పిలుపొచ్చింది.
బీసీసీఐ త్వరలో ముంబయిలో సమావేశం నిర్వహించనుంది. దీనికి భారత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లను హాజరు కావాల్సిందిగా కోరింది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందే వీరిద్దరినీ బీసీసీఐ అధికారులు కలవనున్నారు. ఈ భేటీలో వీరి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒక వార్తా సంస్థతో మాట్లాడినట్లు తెలుస్తోంది. 'రోహిత్, రాహుల్ తో సమావేశం ఉంటుంది. వచ్చే ప్రపంచకప్ కోసం ప్లాన్ చేసుకోవాలి. కెప్టెన్ తో, కోచ్ తో అధికారులు విడివిడిగా మరియు కలిపి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత అన్నింటిపై నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఈ టీ20 ప్రపంచకప్ ప్రదర్శనపై కూడా సమీక్ష నిర్వహిస్తాం' అని అతను చెప్పినట్లు సమాచారం.
టీ20 కెప్టెన్సీ వదులుకునేందుకు రోహిత్ సిద్ధం!
టీ20 కెప్టెన్ నుంచి తప్పుకునేందుకు రోహిత్ శర్మ సుముఖంగా ఉన్నాడనే వార్తలు కొన్నిరోజుల క్రితం వచ్చాయి. దీనిపై రోహిత్ శర్మతో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారని.. హార్దిక్ కు టీ20 పగ్గాలు అప్పగించటంలో హిట్ మ్యాన్ కు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా సమాచారం.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ ను వీక్షించేందుకు అత్యధిక అభిమానులు హాజరైనందుకు బీసీసీఐకు ఈ అవార్డ్ లభించింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29, 2022న గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీన్ని చూసేందుకు 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఇందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐకు స్థానం దక్కింది. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ సీజన్ లోనే ట్రోఫీ అందుకుంది.