BAN W vs IND W: ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో ఓడించిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో భాగంగా నేడు ఢాకా వేదికగా  జరిగిన తొలి వన్డేలో దారుణ ఓటమి ఎదురైంది.  భారత బౌలర్లు సమిష్టిగా రాణించినా  బ్యాటర్ల వైఫల్యంతో మొదటి వన్డేలో  అవమానకరమైన ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 153  పరుగులను కూడా  భారత బ్యాటర్లు  ఛేదించలేకపోయారు.  113 పరుగులకే కుప్పకూలి.. 40 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. 


బౌలింగ్ అదుర్స్.. 


వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన  బంగ్లాదేశ్.. 43 ఓవర్లలో  152 పరుగులకే ఆలౌట్ అయింది.    కెప్టెన్ నైగర్ సుల్తానా (64 బంతుల్లో 39, 3 ఫోర్లు) టాప్ స్కోరర్.  భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్.. నాలుగు వికెట్లతో చెలరేగగా దేవికా వైద్య 2 వికెట్లు పడగొట్టింది.  దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.  


వచ్చి వెళ్లారు.. 


స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దారుణంగా తడబడింది.  ఓపెనర్‌గా  వచ్చిన స్మృతి మంధాన (12 బంతుల్లో 11, 2 ఫోర్లు),  ప్రియా పునియా (27 బంతుల్లో 10, 1 ఫోర్) విఫలమయ్యారు.  ఈ ఇద్దరినీ మరూఫా అక్తర్  ఔట్ చేసింది.  వన్ డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా (24 బంతుల్లో 15, 1 ఫోర్)  కూడా ఎక్కువసేపు నిలువలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (5) కూడా విఫలమైంది.  భారత్ భారీ ఆశలు పెట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్.. (26 బంతుల్లో 10)  కూడా నిరాశపరిచింది. 61 పరుగులకే భారత్ కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది.


 






ఈ క్రమంలో దీప్తి శర్మ (40 బంతుల్లో 20), అమన్‌జోత్ కౌర్ (40 బంతుల్లో 15)  కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయడమే గాక  స్కోరుబోర్డును కూడా ముందుకు నడిపించారు.  కానీ  మరూఫా అక్తర్.. భారత్‌కు మరోసారి షాకిచ్చింది.  ఆరో వికెట్‌కు 30 పరుగులు జోడించిన దీప్తి - అమన్‌జోత్‌ల జోడీని  ఆమె విడదీసింది.   ఇక ఆమె నిష్క్రమించిన  తర్వాత భారత్ ఆలౌట్ అవడానికి  పెద్దగా సమయం పట్టలేదు.  స్నేహ్ రాణా (0), పూజా వస్త్రకార్ (7)లు కూడా విఫలమయ్యారు. దీప్తి శర్మను రబే ఖాన్  పెవిలియన్‌కు పంపింది.  35వ ఓవర్లో బారెడ్డి అనూష  (2)  రనౌట్ కావడంతో  భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో  బంగ్లా జట్టు విజయాన్ని అందుకుంది. బంగ్లా బౌలర్లలో మరూఫా అక్తర్ నాలుగు వికెట్లు తీయగా.. రబే ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. 


వన్డేలలో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై  బంగ్లాదేశ్.. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న  భారత్‌ను నిలువరించి విక్టరీ కొట్టడం గమనార్హం.  ఈ విజయంతో బంగ్లా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో వన్డే జులై 19న ఇదే వేదికపై జరుగనుంది.































Join Us on Telegram: https://t.me/abpdesamofficial