India beat Thailand to win first ever Badminton Asia Team Championships title: బ్యాడ్మింటన్‌ లో భారత మహిళల జట్టు సాధించేసింది. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌(Badminton Asia Team Championships 2024) లో  పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో  తొలిసారి విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో థాయ్‌లాండ్‌ను 3-2 తేడాతో ఓడించి  భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆసియా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టుగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో రెండు సింగిల్స్‌, ఒక డబుల్‌ మ్యాచ్‌లో గెలిచి భారత జట్టు స్వర్ణాన్ని ముద్దాడింది.

పీవీ సింధు, గాయత్రీ గోపిచంద్-త్రిశా జోలీ జోడీ, అన్‌మోల్‌ ఖర్బ్‌ తమ మ్యాచుల్లో గెలిచారు. రెండేళ్ల కిందట థామస్‌ కప్‌ను నెగ్గిన భారత్‌కు ఆ తర్వాత ఇదే అతిపెద్ద టోర్నీ విజయం కావడం విశేషం. ఫైనల్లో ఒలింపిక్‌ పతకాల విజేత, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టేసింది. కేవలం 39 నిమిషాల్లోనే థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద కతేతోంగ్‌పై 21-12, 21-12 తేడాతో విజయం సాధించి భారత్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండో మ్యాచ్‌లో గాయత్రీ గోపిచంద్‌-జోలీ త్రిశా జోడీ అద్భుతంగా పోరాడింది.

థాయ్‌ షట్లర్లు కితిథరకుల్‌-రవ్విందాపై 21-16, 18-21, 21-16 తేడాతో గెలవడంతో టీమ్‌ఇండియా లీడ్‌ 2-0 దూసుకెళ్లింది. మూడో మ్యాచ్‌లో అష్మితా చలిహాకు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత మరొక డబుల్స్‌ మ్యాచ్‌నూ శ్రుతి - ప్రియా 11-21, 9-21తో ఓడిపోయింది. దీంతో ఫైనల్‌ 2-2తో సమమైంది. ఇక స్వర్ణం సాధించాలంటే చివరి మ్యాచ్‌లో విజయం తప్పనిసరైంది. ఈ దశలో అన్‌మోల్‌ అదరగొట్టేసింది. పోర్‌పిచాపై 21-14, 21-9 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌కు స్వర్ణం అందించింది.

 

ప్రయాణం సాగిందిలా....

ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్(Badminton Asia Team Championships 2024) ఫైనల్లో అడుగు పెట్టింది. తొలుత సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 13-21, 20-22 తేడాతో అయా ఒహోరి చేతిలో ఓడింది. దీంతో జపాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ లో భారత జోడీ త్రిసా-గాయత్రీ గోపిచంద్ అద్భుతంగా అడి... నమీ మత్సుయమ-చిహారుపై 21-17, 16-21, 22-20 తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లూ.. 1-1తో సమంగా నిలిచాయి.

మరో మ్యాచ్ లో జపాన్ కు చెందిన నొజోమి ఒకుహరపై 21-17, 21-14 తేడాతోగెలిచిన అష్మిత భారత్ ఆధిక్యాన్ని 2-1కు చేర్చింది. అయితే అశ్విని పొన్నప్ప-PV సింధు జోడీపై 21-14, 21-11తో మియుర- సుకురమోటో విజయం సాధించడంతో..భారత్-జపాన్ 2-2తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో భారత యువషట్లర్ అనమోల్ 52 నిమిషాలపాటు పోరాడి వరల్డ్ 29వ ర్యాంకర్ నత్సుకిపై.... 21-14, 21-11 తో గెలిచింది. తద్వారా 3-2 తేడాతో భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఆసియాటీమ్ ఛాంపియన్ షిప్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. అనంతరం ఫైనల్లో ధాయిలాండ్‌ను మట్టికరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.