Nathan Lyon Wants Pakistan Team For T20 World Cup Final: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు టి20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ను  వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరల్డ్ కప్ ను ఏ జట్టు గెలుచుకుంటుంది అన్న దానిపై విశ్లేషణలు సాగుతున్నాయి. మాజీ ఆటగాళ్లు, కోచ్ లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరబోయే జట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టును ఇటువంటి వరల్డ్ కప్ ఫైనల్లోకి చేరాలని ఆయన ఆకాంక్షించాడు. తన ఫేవరెట్ జట్లలో ఆస్ట్రేలియాను, పాకిస్థాన్ ను చేర్చిన లియాన్.. భారత్ ను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు లియాన్. ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ మేరకు లియాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు కూడా ఫైనల్ కు చేరుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ జట్టులో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారు. బాబర ఆజమ్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. అందుకే పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంటుందని భావిస్తున్నాను' అని లియాన్ ఆ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు.


ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని, టోర్నీ ప్రారంభంలోనే అత్యధిక స్కోర్ ను చూడబోతున్నామని లియాన్ వెల్లడించారు. ఆస్ట్రేలియా జట్టును టోర్నీలో నడిపించబోతున్న మిచెల్ మార్ష్ బంతితోను, బ్యాట్ తోనూ రాణిస్తాడన్న ఆశాభావాన్ని లియాన్ వ్యక్తం చేశాడు. 


బాబర్ ఆజమ్ ను ఎంపిక చేసిన పాక్ క్రికెట్ బోర్డ్


టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించేందుకే బాబర్ ఆజమ్ జట్టులోకి వచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్టార్ బ్యాటర్ బాబర్ ను గ్రీన్ ఆర్మీ కెప్టెన్ గా తిరిగి నియమించింది. 2023 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ విఫలమైన తర్వాత బాబర్ ఆజమ్ కెప్టెన్సీ ని వదులుకున్నాడు. ఆ తర్వాత షాహీన్ షా అఫ్రిదికి పాకిస్తాన్ టి20 కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు. వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ బాబర్ ఆజమ్ కు బాధ్యతలను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అప్పగించింది. టి20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ ముందుగా ప్రకటించింది. భారత్ తో కలిసి గ్రూప్-ఏలో చోటు దక్కించుకున్న బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు జూన్ ఆరో తేదీన అమెరికాతో మ్యాచ్ ఆడడం ద్వారా టోర్నమెంటును ప్రారంభించనుంది.