Australian Open 2023:  ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీ నుంచి భారత్ డబుల్స్ జోడీ సానియా మీర్జా, అన్నా డానిలీనా నిష్క్రమించింది. శనివారం మహిళల డబుల్స్ లో పోటీలో అలిసన్ వాన్ ఉత్వానాక్- అన్హెలినా కాలినానా జంట చేతిలో 4-6, 6-4, 2-6 తేడాతో పరాజయం పాలైంది. ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సానియా మీర్జాకు ఇదే చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ. 


అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ పోటీలో సానియా- రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్ లోకీ దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాకు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ జంట జామీ ఫోరెలిస్- ల్యూక్ సవిల్ పై ఈ జోడీ విజయం సాధించింది. 


భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవలే టెన్నిస్ కు రిటైర్ మెంట్ ప్రకటించింది. తన కెరీర్‌లో సానియా ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016 డబుల్స్ విజేతగా నిలిచింది. అంతకుముందు, అతను 2015లో యుఎస్ ఓపెన్,  వింబుల్డన్ గెలుచుకుంది. సానియా 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ టైటిల్ ను గెలుచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ సానియా మీర్జా చిట్టచివరి టోర్నీ. 


రిటైర్మెంట్ లేఖ


జనవరి 13న తన రిటైర్మెంట్ గురించి సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్టును పెట్టింది. తన టెన్నిస్ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.


‘‘నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే 50 గ్రాండ్ స్లామ్స్‌పైగా ఆడాను. వాటిల్లో కొన్ని టైటిల్స్ గెలిచాను. గెలిచిన తర్వాత స్టేడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి, టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో విజయాలు అందుకోగలిగిందంటే సామాన్య విషయం కాదు. నా గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని  2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలెట్టా.. అక్కడే నా కెరీర్‌ను  ముగించడం సమంజమని భావిస్తున్నా..’’ అని సానియా మీర్జా లేఖలో పేర్కొంది. 2003లో అంతర్జాతీయ ఆటలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు 6 సార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచింది.