Maxwell announce Retirement From ODI Format | ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ అధికారికంగా వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్‌లో 13 ఏళ్ల పాటు ఆసీస్ కు ప్రాతినిథ్యం వహించాడు. తాజా ప్రకటనతో ఆసీస్ వన్డే ప్రపంచ కప్ హీరో వన్డే కెరీర్‌కు తెరపడింది.

వన్డే వరల్డ్ కప్‌ల హీరో

2012లో తన అరంగేట్రం చేసిన మ్యాక్స్‌వెల్ రెండుసార్లు ODI ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు మాత్రమే కాదు. ODI ప్రపంచ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు ఈ ఆల్ రౌండర్. 149 వన్డే మ్యాచ్‌లలో మ్యాక్స్‌వెల్ దాదాపు 4,000 పరుగులు చేశాడు. ప్రపంచంలోని విధ్వంసకర బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ ఒకడు. గత వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ పై చేజింగ్ లో చేసిన డబుల్ సెంచరీ అతడి కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. వన్డే వరల్డ్ కప్ లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో మ్యాక్సీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఒకటని చెప్పవచ్చు.

మ్యాక్స్‌వెల్ కెరీర్

149 వన్డేలాడిన మ్యాక్స్‌వెల్ 3,990 పరుగులు చేశాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు మ్యాక్సీ. బంతిలోనూ కీలక సమయంలో వికెట్లు తీశాడు. అతడి ఖాతాలో 77 వికెట్లు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్కోరు 201 నాటౌట్. 33.81 సగటుతో పరుగులు సాధించాడు. మ్యాక్స్‌వెల్ 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో అతడి బెస్ట్ బౌలింగ్ 4/40. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న మ్యాక్స్‌వెల్ టీ20లపై ఫోకస్ చేయనున్నాడు.

కొన్ని నెలల కిందే హిట్ ఇచ్చిన మ్యాక్సీ

Cricket.com.au రిపోర్ట్ ప్రకారం.. ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా సెలెక్టర్ జార్జ్ బెయిలీకి 2027లో జరిగే ODI ప్రపంచకప్‌లో తాను ఆడేది లేదని తెలిపాడు. 2022లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మ్యాక్స్‌వెల్ కోలుకున్నాడు. ఎడమ కాలు గాయం నుండి కోలుకున్న మ్యాక్సీ.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్ కప్పు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తన స్థానంలో మరో టాలెంటెడ్ క్రికెటర్‌కు అవకాశం రావాలని ఆకాంక్షించాడు. త్వరలో యువ ఆటగాడికి ఆటగాడికి జట్టులో చోటు దక్కుతుందని హర్షం వ్యక్తం చేశాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పుడు ఆస్ట్రేలియా 2023 ప్రపంచకప్ విజేత జట్టులోని నాల్గవ సభ్యుడిగా వన్డే ఇంటర్నేషనల్స్ నుండి వీడ్కోలు పలికాడు. ఇదివరకే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్  రిటైర్మెంట్ ప్రకటించారు. పలువురు కీలక ఆటగాళ్ళు ఈ ఫార్మాట్ నుండి తప్పుకున్నందున, ఛాంపియన్లైన ఆస్ట్రేలియా ఇప్పుడు ODI జట్టును రీబిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2027 ప్రపంచకప్ ముందు కొత్త మ్యాచ్ విజేతలను గుర్తించడం వంటి పనిని ఎదుర్కొంటోంది.